హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ తాండూరు డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తాండూర్(రంగారెడ్డి): హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ తాండూరు డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల విచారణ, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాండూరు సబ్‌డివిజన్‌లో కేసుల విచారణ లోపభూయిష్టంగా ఉందని, రికార్డుల నిర్వహణ కూడా సరగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై డీజీకి రిపోర్టు చేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోలీస్ శాఖలో కూడా పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్లను వెస్ట్ సైబరాబాద్ కిందికి తీసుకురానున్నట్లు తెలిపారు. అలాగే, భువనగిరి, యాదగిరిగుట్ట పరిధిలోని 15 పోలీస్‌స్టేషన్లు కూడా సైబరాబాద్ పరిధిలోకి వస్తాయన్నారు. అనంతరం ఆయన డివిజన్ పరిధిలో శిక్షణ పొందుతున్న 15 మంది ట్రైనీ ఎస్సైలతో సమావేశమయ్యారు. డీఎస్పీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఆయనతోపాటు జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ కూడా ఉన్నారు.