బల్లికురవ, ఇంకొల్లు, న్యూస్‌లైన్: బల్లికురవ మండలం కొత్తూరులో బత్తిన హనుమంతరావు, పెంట్యాల ఆంజనేయులుకు చెందిన మెట్టపొలం ఆరు ఎకరాలను అదే గ్రామానికి చెందిన పరిమి శింగరకొండ, యన్నం ఆంజనేయులు, మన్నెం అమరయ్యలు తలా రెండెకరాల చొప్పున కౌలుకు తీసుకుని మిర్చి సాగుచేశారు. వాతావరణం అనుకూలించడంతో పంట దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. కోసిన మిర్చిని పొలాల్లోని కళ్లాలు చేసి ఎండబెట్టారు.
సోమవారం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉండటంతో వర్షం పడుతుందేమోనని పరిమి శింగరకొండ (45), యన్నం ఆంజనేయులు కుమారుడు రాఘవ (16), మన్నెం అమరయ్య కుమారుడు పవన్‌కుమార్ (12) కళ్లాల్లో ఉన్న మిర్చికి పరదాలు కప్పేందుకు పొలం వెళ్లారు. పరదాలు కప్పిన తరువాత వర్షం పెరగడంతో అక్కడే పరదాలతో వేసిన గుడారం కిందకు ముగ్గురూ చేరారు. ఆ గుడారమే వారి పాలిట మృత్యుకుహరమైంది. గుడారంపై పిడుగు పడటంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. పశువులు తోలుకుని ఉదయం 11 గంటల సమయంలో పొలం చేరుకున్న గ్రామస్తులు ముగ్గురూ మరణించడం గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని అద్దంకి సీఐ వీవీ రమణకుమార్ సందర్శించి మృతుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. వీఆర్వో పోతురాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
రెక్కాడితేగానీ..డొక్కాడని కుటుంబాలు:
పరిమి శింగరకొండ, యన్నం ఆంజనేయులు, మన్నెం అమరయ్యలు బంధువులు. వీరు ముగ్గురికీ సెంటు భూమిలేదు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. వీరు కలిసి పొలం కౌలుకు తీసుకుని తలా రెండెకరాల మెట్ట, రెండెకరాల మాగాణిలో మిర్చి, వరి సాగు చేస్తూ కుటుంబాలు నెట్టుకొస్తున్నారు. పిడుగుపాటుకు మృతిచెందిన శింగరకొండకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆంజనేయులుకు కుమారుడు రాఘవ, కుమార్తె అంజమ్మ ఉన్నారు. అంజమ్మను శింగరకొండ కుమారుడు శివకు ఇచ్చి వివాహం చేశారు. రాఘవ ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో సీ గ్రేడులో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్మీడియెట్‌లో చేరే పనిలో ఉన్నాడు. అమరయ్యకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు పవన్‌కుమార్ చనిపోయాడు. దీంతో ఈ మూడు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మృతుల బంధువుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
పూసపాడులో...
ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన గంటా వెంకట సుబ్బారావు మిరప సాగు చేశాడు. కోతలు పూర్తయి కళ్లాల్లో ఆరబెట్టారు. సోమవారం తెల్లవారుజామున ఆకాశం మేఘావృతమై ఉండటంతో మరో ఐదుగురితో కలిసి మిర్చిపై పరదాలు కప్పేందుకు వెళ్లారు. మిరపకాయలు తడవకుండా పట్టలు కప్పుతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో శీలం కనకాంబరం (42) అనే కూలీ అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న మృతుని కుమారుడు క్రాంతికుమార్, గంటా వెంకట సుబ్బయ్య, శీలం అనీల్, శీలం సన్ని, మద్దిరాల సుందరరావులకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని హుటాహుటిన చీరాల ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీఆర్‌ఓ జి.కోటయ్య ఫిర్యాదు మేరకు ఇంకొల్లు ఏఎస్‌ఐ ఆర్.ఎస్.ఎన్ మూర్తి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలను గ్రామ సర్పంచ్ పర్చూరు సింగయ్యతో పాటు పరామర్శించారు.
కనకాంబరం వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలకు వివాహం చేశాడు. కుమారుడిని కష్టపడి చదివిస్తున్నాడు. పిడుగుపడి కనకాంబరం మృతిచెందగా..తండ్రికి సాయమందించేందుకు వెళ్లిన కొడుకు క్రాంతికుమార్ గాయాలపాలవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
బడుగులపై పిడుగు
Published Tue, May 27 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM
Advertisement
Advertisement