
ఆంద్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అద్దంకికి చేరువలో ఉన్న పుణ్యక్షేత్రం సింగరకొండలో లక్ష్మీనరసింహస్వామి క్షేత్రపతిగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రపాలకునిగా పూజలు అందుకుంటున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ల ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో అత్యంత వైభవంగా జరుపుతారు. ప్రస్తుతం 70వ తిరునాళ్ల మహోత్సవాలు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి, బుధవారం ఆరంభం అయ్యాయి.
ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. శింగరకొండ అద్దంకి నుంచి 6 కి.మీ. దూరంలో భవనాసి చెరువు ఒడ్డున ఉంది. మొదట్లో సింగనకొండ అని పిలిచిన నరసింహ క్షేత్రం తర్వాత తర్వాత సింగరకొండ ఆంజనేయ స్వామి క్షేత్రం గానే ప్రఖ్యాతి గాంచింది.
సింగరకొండపై లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉండగా కొండ దిగువన చెరువు ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే భూతప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని స్థానికులు చెబుతారు.
ఇక కొండ దిగువన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామికి స్థల పురాణం ఉంది. తమ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపథం బయలుదేరిన ఆంజనేయుడు, ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారని నమ్మకం. అందుకే ఇక్కడ ఆంజనేయుడు దక్షిణాముఖుడై కనపడతాడు. అద్దంకి తాతాచార్యులు అనే గొప్ప భక్తుడు సింగరకొండలో కొండపై గల నరసింహ స్వామి గుడియందు ధ్వజారోహణ చేస్తుండగా, కొండకింద ఒక దివ్యపురుషుడు ఒక ఆంజనేయ విగ్రహానికి హారతి ఇస్తూ కనిపించడంతో పరుగు పరుగున కిందికి వెళ్లగా తాతాచార్యుల వారికి ఆ పురుషుడు మాయం అయ్యాడు. దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయ విగ్రహం కనపడింది.
అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని తాతాచార్యులతోబాటు కొండమీద ఆలయ పనిలో ఉన్నవారెందరో చూశారు. వాళ్ళు కొండ దిగి వచ్చి చూసేసరికి ఆ పుణ్యమూర్తి కనిపించలేదు. మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగిపోతూ కనిపించింది. దాంతో ఆ గ్రామస్తులు, చుట్టుపక్కలవారు కలిసి, లక్ష్మీ నసింహ దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా కట్టించారు.
సమీప దర్శనీయ ఆలయాలు: అయ్యప్పస్వామివారి ఆలయం, షిర్డీ సాయిబాబావారి ఆలయం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం, శ్రీ గాయత్రీ మాత ఆలయం, కొండపై నెలకొని ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం, శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం చూడదగ్గవి.
వసతి: సింగరకొండలో వసతి పొందాలనుకునేవారు దేవస్థానం ఏర్పాటు చేసిన కాటేజీలలో బస చేయవచ్చు. కనుక ఇక్కడికి వచ్చే యాత్రికులు మారుతి భవన్‌లో వసతి ΄పొందవచ్చు. తక్కువ ధరకే అద్దెకు లభిస్తుంది. ఈ భవన్ రెండు అంతస్తుల సముదాయం.
ఎలా చేరుకోవాలంటే..?
హైదరాబాద్ నుంచి 290 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 110 కిలోమీటర్లు, ఒంగోలు నుంచి 36 కిలోమీటర్లు, అద్దంకి నుంచి 5 కిలోమీటర్ల దూరం.
విమాన మార్గం ద్వారా: సమీప విమానాశ్రయం విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్. అక్కడ దిగి క్యాబ్ లేదా టాక్సీలలో సింగరకొండ చేరుకోవచ్చు.
రైలు మార్గం: ఒంగోలు రైల్వేస్టేషన్ సమీ΄ాన ఉంది. హైదరాబాద్, విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ళన్నీ ఒంగోలు స్టేషన్లో ఆగుతాయి.
రోడ్డు/ బస్సు మార్గం: సమీప బస్ స్టాప్ – అద్దంకి. హైదరాబాద్, విజయవాడ, ప్రకాశం నుంచి అద్దంకికి బస్సులు ఉన్నాయి.
ఒంగోలు నుంచి: బస్సు ప్రయాణీకులు అద్దంకి వెళ్లే బస్సు ఎక్కాలి. అద్దంకి నుంచి సింగరకొండకు ప్రతి అరగంటకీ బస్సులు ఉన్నాయి.
సింగరకొండ తిరునాళ్లగా ప్రసిద్ధికెక్కిన ఈ తిరునాళ్లు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి హోలీపూర్ణిమ వరకు మూడురోజులపాటు జరుగుతాయి. ఇరువురు స్వాములకూ విశేష పూజలు జరుగుతాయి.
( చదవండి: 'మిల్లెట్ కేక్' తయారీతో కోట్ల రూపాయల టర్నోవర్..! మోదీ ప్రశంసతో ఒక్కసారిగా..)
Comments
Please login to add a commentAdd a comment