దుర్గమ్మకు పూజలు చేస్తున్న జిలానీ
ఒంగోలు , కందుకూరు : అతను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పేరు సయ్యద్ జిలానీ. దుర్గామాతకు వీరభక్తుడైన ఇతను మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాడు. 24 ఏళ్లుగా అమ్మవారి సేవలో తరిస్తూ ఏకంగా దుర్గామాత ఆలయాన్ని నిర్మించి ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నాడు. ఆలయంలో దూపదీప నైవేద్యాలకు, అమ్మవారి ఉత్సవాలకు లోటులేకుండా అన్నీ తానై నిర్వహిస్తున్న సయ్యద్ జిలానీ భవానీ స్వామిగా పేరుపొందాడు.
గుంటూరుకు చెందిన సయ్యద్ బడేషా, హుస్సేన్‌బీ దంపతులకు ఆరుగురు సంతానం. చివరివాడైన సయ్యద్ జిలానీ తండ్రితో విభేదాలు తలెత్తడంతో ఇల్లు వదిలి బయటకు వచ్చాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ భార్యతో కలిసి కందుకూరు చేరుకున్నాడు. అంకమ్మ దేవాలయంలో ఓ చిన్న గదిలో ఉంటూ.. ఆరు నెలలపాటు భవానీ దీక్ష తీసుకున్నాడు. దుర్గమ్మ ఆలయం నిర్మించాలని నిర్ణయించుకుని, జనార్దన కాలనీకి చేరుకుని కోవూరు రోడ్డు పక్కనే 4 సెంట్ల స్థలాన్ని రూ.10 వేలకు కొనుగోలు చేశాడు. కాలనీ పెద్దలతోపాటు దాతల సాయంతో రూ.20 లక్షలు వెచ్చించి ఆలయాన్ని నిర్మించాడు. ఇటీవలే మరో రూ.14 లక్షలతో భారీ శివలింగంతోపాటు, నవగ్రహాలు, నాగబంధం విగ్రహాలను ప్రతిష్టించాడు. ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటు పండుల సమయాల్లో వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
జిలానీ భార్య బేగంతోపాటు ముగ్గురు కుమార్తెలు దుర్గమ్మ సేవకు అంకితమయ్యారు. కుమార్తెలకు అంకమ్మ, శివనాగమ్మ, రేణుకాదుర్గ అని పేర్లు పెట్టాడు. పెద్ద కుమార్తె అంకమ్మకు మసీదులో పేష్ ఇమామ్‌గా పనిచేసే యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు.