23 ఏళ్లుగా దుర్గామాత సేవలో సలీమ్ నియారియా
రామ్.. రహీమ్ అంతా ఒక్కరే, ఖురాన్.. భగవద్గీత చెప్పేదొక్కటే అనేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది రాయగఢ్ లోని దుర్గానవరాత్రోత్సవం. సర్వమత సమానత్వాన్ని చాటుతూ 23 ఏళ్లుగా నవరాత్రుల్లో దుర్గామాతను నిలబెట్టడంలోనూ, తిరిగి నిమజ్జనం చేయడంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నాడు 50 ఏళ్ల షేక్ సలీమ్ నియారియా. అవును.. ముస్లిం అయి ఉండి కూడా నవరాత్రుల నిర్వహణకు నడుం కడుతున్నాడీయన.
హండీచౌక్ దుర్గా కమిటీ పేరున... రాయగఢ్ లోని హండీచౌక్ ప్రాంతంలో నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ గా ఉన్న నియారియా... మొత్తం 25 మంది బృందంలో తనతోపాటు మరో ముగ్గురు ముస్లింల సాయంతో దుర్గా పూజ వేడుకలు నిర్వహిస్తున్నారు. వీరంతా నవరాత్రుల్లో దుర్గాపూజా కార్యక్రమాల్లో ప్రత్యేక పాత్రపోషించి, అంగరంగ వైభవంగా వేడుకలు జరిపిస్తున్నారు. అలాగే మరెందరో ముస్లిం కళాకారులు దుర్గా మండపాన్ని అలంకరించడంలోనూ పాల్గొంటున్నారు. 1992 నుంచి ప్రారంభించిన ఉత్సవాల కార్యక్రమాలకు నియారియా కేవలం యాజమాన్యం వహించడం కాక, స్వయంగా ప్రతి కార్యక్రమంలోనూ పాలుపంచుకుంటున్నారు. అలాగే దుర్గా శరన్నవరాత్రుల అనంతరం తొమ్మిదవరోజు దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఒక్క దుర్గామాత విషయంలోనే కాదు అతడు అన్ని మతాల కార్యక్రమాల్లోనూ అదే రీతిలో పాల్గొంటారు.