
వైఎస్ పాలనలోనే పేదలకు కార్పొరేట్ వైద్యం
దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి హయాంలో కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
విరువూరు(పొదలకూరు): దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి హయాంలో కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని విరువూరులో లయన్స్‌క్లబ్ ఆఫ్ నెల్లూరు-ప్రగతి ఆధ్వర్యంలో సర్పంచ్ బచ్చల సురేష్‌కుమార్ నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ వైద్యం పేదలకు సక్రమంగా అందడం లేదన్నారు.
వైఎస్సార్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి పేదవాడు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని పొందగలిగినట్టు తెలిపారు. ప్రస్తుతం పథకం పేరు మార్చినా వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాలకు ఉచిత వైద్య శిబిరాలు రావడం మంచి పరిణామమన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇంతకాలం అవుతున్నా ఎవరూ గ్రామాల్లోని పేదలకు వైద్యసేవలు అందివ్వాలని ఆలోచించలేదన్నారు. ఒక్క వైఎస్సార్ మాత్రమే ఆ దశగా ఆలోచించి ఆరోగ్యశ్రీని అమలు చేసినట్టు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో నివశించే వారు చిన్నపాటి రుగ్మతలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే విరువూరు గ్రామం ఊహించని విధంగా అభివృద్ధి జరిగి ఉండేదన్నారు. తనకు అత్యంత మెజారిటీ సాధించి పెట్టిన గ్రామాల్లో విరువూరు ఒకటిగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రసూల్, సెక్రటరీ సురేష్, ట్రెజరర్ జమీర్ , జగదీష్, గ్రామసర్పంచ్ బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కొల్లి రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.