జన్మస్థలానికి సేవచేయడం అదృష్టం
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
వింజమూరు : పుట్టిన ఊరికి సేవ చేయడం వారి అదృష్టమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడి అన్నారు. కేజీఆర్వీఎస్ ట్రస్ట్ ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ శిబిరంలో 2000 మందికి కంటి, దంత, జనరల్ సర్జన్, జనరల్ ఫిజిషియన్లు, కీళ్లు, ఎముకల నిపుణులు, గైనకాలజిస్ట్ వైద్య పరీక్షలు చేశారు. ఎంపీ మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం అనేది పరిసరాల పరిశుభ్రత, తాగునీటిపై ఆధారపడి ఉంటుందన్నారు. పురాతన సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన భారతదేశంలో ప్రజలకు కనీసం మరుగుదొడ్లు లేకపోవడం బాధాకరమన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛభారత్‌లో భాగంగా 2.13 లక్షల కోట్ల మందికి మరుగుదొడ్లు నిర్మిస్తున్నారన్నారు. 2019 నాటికి నాగరిక పరిశుభ్రత దేశంగా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పల్లెప్రాంతాల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు ద్వారా వైద్యసేవలు అందించడం అభినందనీయమన్నారు.
కొండా కుటుంబ సభ్యులు నగరాల్లో వ్యాపారాలు చేసుకుంటూ తాము సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని నిరుపేదలకు వైద్యం, విద్య, సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఆదర్శనీయమన్నారు. వైద్యశిబిరాల్లో గుర్తించిన శస్త్ర చికిత్సలను కూడా ఉచితంగా చేయించడం సంతోషకరమన్నారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం ముదావహమన్నారు.
ట్రస్ట్ సేవలు అభినందనీయం : మాజీ ఎమ్మెల్యే మేకపాటి
వింజమూరులో కేజీఆర్వీఎస్ ట్రస్ట్ సేవలు అందించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. తన చేతుల మీద ప్రారంభించిన ట్రస్ట్ ఈ రోజు నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఉచిత వైద్యం, విద్య, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం సంతోషకరంగా ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో పేదలకు ఖర్చు చేయాలన్నారు. ధనవంతులు, నాగరికత బాగా తెలిసిన వారు వింజమూరులో ఉన్నందున మరిన్ని ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు సాయం చేయాలన్నా రు. ఎవరైతే బతికున్నప్పుడు ప్రజలకు సేవలందిస్తారో చనిపోయిన తర్వాత కూడా వారి సేవలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. తాము కూడా విద్య, వైద్య సేవలు చేయడానికి సహకరిస్తామన్నారు.
మేకపాటి సోదరులకు ఘనస్వాగతం : కేజీఆర్వీఎస్ ట్రస్ట్ ఉచిత మెగావైద్యశిబిరాన్ని ప్రాంభించేందుకు వచ్చిన ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక శ్రీవివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులను మేకపాటి సోద రులను ఆత్మీయంగా పలకరించారు. మేకపాటి సోదరులను కేజీఆర్వీఎస్ ట్రస్ట్ ప్రతినిధులు సన్మానించారు. అన్నిరకాల వైద్యశిబిరాల్లోని వైద్యబృందాన్ని మేకపాటి సోదరులు పలకరించారు.
వైద్యులు కూడా మేకపాటి సోదరులకు వైద్యపరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గణపం కృష్ణకిరణ్‌రెడ్డి, తహశీల్దార్ టి.శ్రీరాములు, వింజమూరు, కలిగిరి సర్పంచ్‌లు గణపం బాలకృష్ణారెడ్డి, పావులూరి మాల్యాద్రిరెడ్డి, విశాంత్ర డీఎంహెచ్‌ఓ కె.మాశిలామణి, కేజీఆర్వీఎస్ ట్రస్ట్ చైర్మన్ కె.రామాచంద్రరావు, కార్యదర్శి కొండా చినవెంకటేశ్వర్లు, ట్రెజరర్ కొండా వెంకటేశ్వర్లు, ట్రస్ట్ వ్యవసాపకుడు కొండా వెంకటప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు.