డ్వాక్రా రుణాలను రద్దు చేస్తాం | dwakra loans will be waived off, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

డ్వాక్రా రుణాలను రద్దు చేస్తాం

Published Mon, Feb 3 2014 1:23 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM

డ్వాక్రా  రుణాలను రద్దు చేస్తాం - Sakshi

డ్వాక్రా రుణాలను రద్దు చేస్తాం

మరో నాలుగు నెలల్లో అధికారంలోకి వచ్చీరాగానే రాష్ట్రంలో డ్వాక్రా మహిళా సంఘాలు తీసుకున్న రూ.20 వేల కోట్ల రుణాలను రద్దు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

 అక్కాచెల్లెళ్లకు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా
 
 ‘ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:
 మరో నాలుగు నెలల్లో అధికారంలోకి వచ్చీరాగానే రాష్ట్రంలో డ్వాక్రా మహిళా సంఘాలు తీసుకున్న రూ.20 వేల కోట్ల రుణాలను రద్దు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మహిళల కన్నీరు తుడవడానికి, యువకులు మద్యం జోలికి పోకుండా ఉండేందుకు బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామన్నారు. అక్రమ మద్యం అమ్మకాల నిరోధం కోసం వెయ్యి మంది జనాభా ఉన్న ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి చెందిన పది మంది మహిళలను పోలీసులుగా నియమిస్తామన్నారు. మద్యం జోలికి పోవాలంటేనే షాక్ కొట్టేంత రీతిలో మద్యం ధరలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. రైతు ముఖంలో ఆనందం కనిపిస్తేనే రైతు కూలీలు, రాష్ట్రం బాగుంటుందనే లక్ష్యంతో తమ ప్రభుత్వంలో వ్యవసాయానికి ఇద్దరు మంత్రులను నియమించనున్నట్లు వెల్లడించారు. పేదలకు కిలో రూపాయికే ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామన్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో ప్రజాప్రస్థానం(ప్లీనరీ)లో ఆయన మాట్లాడారు. పార్టీ పరంగా ఆయన ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
 ప్రజల కష్టాలు ‘ఓదార్పు’లో కళ్లారా చూశాను..
 
 ‘‘ఓదార్పు యాత్రలో నేను వందలాది కుటుంబాలను కలిశాను. వేలాది మంది పేదలను కలిసి వారి గుండె చప్పుడు విన్నాను. వారి కష్టాలను కళ్లారా చూశాను. పనులు చేస్తున్న అవ్వలు, తాతలను పనులెందుకు చేస్తున్నారని అడిగితే ‘మీ నాయన ఇచ్చిన రూ.200 ఫించన్ మాకు మూడు పూటలా తినడానికి సరిపోవడం లేద’ని చెప్పారు. అందుకే అధికారంలోకి వస్తూనే వారికి రూ.700 ఫించన్ ఇవ్వాలని నిర్ణయించాం. ఓదార్పులో నేను వెళ్లినన్ని పూరి గుడిసెలకు ఏ నాయకుడూ పోయి ఉండడు. ఆత్మీయ, అనురాగాల మధ్య ఆ పేద కుటుంబాలు చెప్పిన మాటలు నా జీవితంలో మరచిపోలేను. అయితే ఆ కుటుంబాల్లో ఐదో తరగతి తర్వాత స్కూలుకు వెళ్లాల్సిన పిల్లలు పనులకు పోతున్నారని వారు చెబుతున్నప్పుడు చాలా బాధనిపించింది. వారు పనులకు పోతేనే రూ.100 లేదా రూ.150 వస్తాయని, వాటితో రెండు రోజులు తమ ఇల్లు గడుస్తుందని వారు చెప్పినప్పుడు చాలా చాలా బాధనిపించింది. అందుకే పిల్లల్ని పనికి కాకుండా బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాలో(చిన్నారికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లల వరకు) ప్రతినెలా రూ.వెయ్యి జమచేయాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలోని ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశపెట్టి పేదలను పెద్ద చదువులు చదివిస్తాం.
 
 అన్నీ నిర్వీర్యం చేశారు
 వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే.. కిరణ్ సర్కారు అందులో నుంచి 133 వ్యాధులను తొలగించి పథకాన్ని నిర్యీర్యం చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.6 వేల కోట్లు అవసరమైతే రూ.3 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు రెండో సెమిస్టర్‌లోకి వచ్చినప్పటికీ ఇప్పటి దాకా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదు. ప్రజల మీద రూ.32 వేల కరెంటు బిల్లులు బాదడంతో జనానికి బిల్లు చూస్తేనే షాక్ కొడుతోంది. బిల్లు సరిపోదన్నట్లు సర్ చార్జీలు వేసి ఎంత కరెంటు చార్జీలు వేశారో తెలియని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇంతవరకు పేదలకు ఒక్క కొత్త ఇల్లు, ఒక్క కొత్త రేషన్ కార్డు, ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు ఈ కిరణ్ సర్కారు.
 
 బాబు రైతు రుణాల హామీ నమ్మవద్దు: రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక మాట చెబితే దాని మీద నిలబడాలి. నాయకుడంటే ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. నాయకుడు చేయగలిగేదే చెప్పాలి. ఎన్నికల్లో తాము ఇది చేస్తాం అని చెప్పి ధైర్యంగా ఓట్లు అడగాలి. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రైతు రుణాలు మాఫీ చేస్తామని ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చి రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 1.27 లక్షల కోట్ల రైతు రుణాలు ఉన్నట్లు జనవరి 4న జరిగిన 182వ బ్యాంకర్స్ కమిటీ సమావేశం ప్రకటించింది. 2008లో కేంద్రమే దేశవ్యాప్తంగా రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న రైతులకు మాత్రమే సంబంధించిన 65 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే అందులో రాష్ట్రానికి రూ.11,500 కోట్లు వచ్చింది. కేంద్ర ప్రభుత్వమే మొత్తం వ్యవసాయ రుణాలు రద్దు చేయడానికి అనుకూలించని పరిస్థితులు ఉంటే.. చంద్రబాబు రూ.1.27 లక్షల కోట్లను మాఫీ చేస్తానని దొంగ హామీలిస్తున్నారు. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ కుర్చీని లాక్కొని ఆయన చనిపోవడానికి కారణమైన చంద్రబాబు.. ఇప్పుడు అదే ఎన్టీఆర్ ఫొటోను పక్కన పెట్టుకుని ఓట్లడుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో మనం 30 ఎంపీ సీట్లు గెలిచి కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చి రైతులకు ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం. రైతులు దయచేసి చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మవద్దు.’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement