బాబు వస్తే జాబు పోవాలా...!
విజయనగరం కంటోన్మెంట్ : ‘బాబు వస్తే... జాబు గ్యారంటీ! అన్నారు... ఇప్పుడేమో.. ఉన్న వారిని తొలగిస్తున్నారు.. అంటే బాబు వస్తే జాబు పోవాలా?’ అంటూ డ్వాక్రా సంఘాల అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ కాంతిలాల్ దండేను కలిసి వినతిపత్రాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మీసాల గీత ఆదేశాలతో రూరల్ ఎర్నడ్ బ్యాంకర్లు (ఆర్‌ఈబీ)గా పని చేస్తున్న మహిళా సంఘాల అధ్యక్షులను నిర్ధయగా తొలగిస్తూ నోటీసులిస్తున్నారని తెలిపారు. తమను తొలగించొద్దని న్యాయం చేయూలని 19 మంది డ్వాక్రా సంఘాల మహిళా అధ్యక్షురాళ్లు కలెక్టర్‌ను కోరారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తున్న తమబోటి చిన్నవారిపై తెలుగుదేశం నేతలు కక్షగట్టి మరీ తొలగిస్తున్నారని తెలిపారు.
మున్సిపాలిటీలో తమకు కేటయించిన వార్డుల్లో వెయి మందికి చొప్పున పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. తమపై ప్రజలు, పింఛన్‌దారుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేకున్నా కొత్త ప్రభుత్వంలోని పాలకులు తమ వారిని నియమించుకునేందుకు తమను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాకుంటే రోజుకు ఇద్దరు ముగ్గురును తొలగిస్తున్నారని తెలిపారు. 14వ వార్డుకు చెందిన విజయలక్ష్మి, 29వ వార్డుకు చెందిన బి.వెంకటలక్ష్మి, పుష్ప తదితరులకు ఇప్పటికే తొలగిస్తున్నట్టు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ పేరిట తమను తొలగిస్తున్నట్టు నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. ఉన్నపలంగా తొలగిస్తే మా జీవనం సంగతేంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ విషయూన్ని పరిశీలిస్తానని చెప్పారు.