సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఫామ్-7 దుర్వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఫిర్యాదుల నేపథ్యంలో ఫామ్-7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం గురువారం విచారణ చేపట్టింది. 8 లక్షల 76 వేల ఫామ్-7 దరఖాస్తులు ఎన్నికల సంఘం వద్దకు రాగా, 45 వేల మంది సిబ్బందితో నిరంతరంగా దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. ఇప్పటి వరకు 1,61,005 దరఖాస్తుల పరిశీలన జరిగింది. వీటిలో 5309 మాత్రమే అసలైన దరఖాస్తులుగా నిర్ధారించారు. దాదాపు 1,55,696 నకిలీ దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. మరో నాలుగైదు రోజుల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి జేకే ద్వివేది ఫామ్-7పై స్పష్టత నిచ్చారు. ఫామ్-7 దరఖాస్తు మాత్రమేనని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్లు కాదని తెలిపారు. నకిలీ దరఖాస్తులపై పోలీసుల కేసులు ప్రారంభం కాగానే దరఖాస్తులు ఆగిపోయాయని వెల్లడించారు. కాగా 8లక్షల టీడీపీ ఓట్లు తొలగించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓట్ల తొలగింపు కోసం ఫామ్-7ను ఉపయోగించారని, ’చూస్తుంటే రేపు నా ఓటు కూడా తొలగిస్తారేమో'నని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొనం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment