సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం పాల్పడిన ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ కుంభకోణంపై దర్యాప్తునకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైంది. 797 మంది తెల్ల రేషన్ కార్డుదారుల పేర్లతో పలువురు టీడీపీ నేతలు 761.34 ఎకరాల భూములను కొనుగోలు చేయడంపై ఏపీ సీఐడీ అధికారులతో ఈడీ అధికారులు శుక్రవారం చర్చించారు. సీఐడీ దర్యాప్తులో వెల్లడైన అంశాలపై నివేదికతోపాటు బినామీల వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. వీటిని పరిశీలించిన అనంతరం ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తొలుత తెల్ల రేషన్‌కార్డుదారులకు నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. అనంతరం బడా బాబులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.
మాజీ మంత్రులపై ఇప్పటికే కేసులు
రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే అంటే 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య చంద్రబాబు బృందం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి బినామీ పేర్లతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. ఏడాదికి రూ.60 వేలలోపు ఆదాయం మాత్రమే ఉండే తెల్లరేషన్ కార్డుదారులు కోట్లాది రూపాయల విలువైన భూములు కొనుగోలు చేయడంపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేసింది. వీరి వెనుక చంద్రబాబు బృందం ఉన్నట్లు ఆధారాలను సేకరించింది. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా బినామీ పేర్లతో భూములు కొన్న మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, చంద్రబాబుకు సన్నిహితుడైన బెల్లకొండ నరసింహారావుపై ఐపీసీ సెక్షన్ 320, 506, 120 బీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు సమాంతరంగా విచారణ చేయాలని ఈడీ అధికారులు నిర్ణయించారు.
విచారణకు రెండు బృందాలు!
తొలిదశలో తెల్లరేషన్ కార్డుదారుల పేర్లతో కొనుగోలు చేసిన భూములపై విచారణ చేపట్టి మలిదశలో సీఐడీ దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆదారంగా రాజధాని ప్రాంతంలో జరిగిన భూ కుంభకోణంపై లోతుగా విచారణ చేసేందుకు ఈడీ సిద్ధమైంది. దీనిపై విచారణకు హైదరాబాద్, చెన్నై కార్యాలయాల్లో పనిచేసే అధికారులతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భూముల కొనుగోళ్లపై సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివరాలను సేకరించనుంది. ఆదాయపు పన్ను చెల్లించకుండా భూములు కొన్నవారిపై మనీల్యాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసి విచారించాలని నిర్ణయించింది.
ఈడీకి వివరాలు ఇచ్చాం
ఈడీ అధికారుల సూచన మేరకు అమరావతిలో 761.34 ఎకరాల భూములు కొన్న 797 మంది తెల్లరేషన్‌కార్డుదారుల వివరాలు అందచేశాం. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలపై ఈడీకి ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తాం.
– సునీల్‌కుమార్, సీఐడీ అదనపు డీజీ
Comments
Please login to add a commentAdd a comment