టీజేఏసీ చైర్మన్ కోదండరాం
వికారాబాద్, న్యూస్‌లైన్: చదువు ద్వారా మనిషికి ఆత్మగౌరవం పెరిగి, తగిన గుర్తింపు వస్తుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం పశ్చిమ రంగారెడ్డి జిల్లా తరఫున ఆయా కళాశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు శనివారం వికారాబాద్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రతి కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. ఇంటర్ విద్య చాలా ముఖ్యమని, భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు. ప్రతి వ్యక్తికి చదువు జ్ఞాననేత్రంలా పనిచేస్తుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తెలంగాణ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. రాబోయే తెలంగాణలో విద్యా చట్టాలను పకడ్బందీగా అమలు చేసి కార్పొరేట్ వ్యవస్థను నియంత్రిస్తామన్నారు. మంత్రి ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా కేంద్రం, మెడికల్ కళాశాల, పాలమూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ముఖ్యమని, వీటిని సాధించేదాకా ఆగేది లేదన్నారు. రాబోయే తెలంగాణలో కార్పొరేట్ విద్యాసంస్థలను సరళీకృతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ బిల్లు ఢిల్లీకి చేరిందని, ఈనెల 26లోగా రాష్ర్ట ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విఠ ల్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం 1200 మందికి పైగా విద్యార్థులు బలిదానం చేశారని అన్నారు. 15రోజుల్లో తెలంగాణ జెండా రెపరెపలాడుతుందని.. ఇక విద్యార్థుల మెమోలపై తెలంగాణ అని ముద్రించి ఉంటుందన్నారు. అనంతరం వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాల్లోని మొత్తం 42 కళాశాలలకు చెందిన 84 మంది జూనియర్ కళాశాలల విద్యార్థులకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఆర్‌ఐఓలు ప్రతాప్, గౌరీశంకర్, తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, పశ్చిమ రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం అధ్యక్షుడు రాజవర్దన్‌నెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్, ట్రెజరర్ జైపాల్, ప్రతినిధులు శ్రీనివాస్, నర్సింలు, ఆయా కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చదువుతోనే మనిషికి గుర్తింపు
Published Sat, Feb 1 2014 11:40 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement