సీఐ, ఎస్‌ఐల వీఆర్ ఉత్తర్వులు వెనక్కు తీసుకోలేదు
నిందితులు అరెస్ట్‌కాగానే వీఆర్‌కు పంపుతాం
డీఐజీ బాలకృష్ణ
అనంతపురం క్రైం : జిల్లాలో ఫ్యాక్షన్ రూపుమాపడానికి పారదర్శకంగా, జవాబుదారితనంగా పని చేస్తున్నామని డీఐజీ బాలకృష్ణ బాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాప్తాడులో జరిగిన ప్రసాద్‌రెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసులో 32 మందిని అరెస్ట్ట్ చేశామని తెలిపారు.
ఇంకా పలువురిని గుర్తిస్తున్నామని, వారి ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. ప్రసాద్‌రెడ్డి హత్యఘటన స్థలంలో రాప్తాడు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ నేమ్‌ప్లేట్ పడి ఉన్న విషయమై ఆరోపణలు వస్తుండడం బాధాకరమన్నారు. అక్కడికి వచ్చిన ప్రజల్ని నియంత్రించడంలో నేమ్‌ప్లేట్ కిందకుపడిపోయి ఉండవచ్చని తెలిపారు. అంతమాత్రాన ఆయన పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగే డీజీపీపై కూడా ఆరోపణలు చేస్తుండడం సరికాదన్నారు.
ఆయన జిల్లా వాస్తవ్యుడు కావడంతో సహజంగానే బంధువులు, మిత్రులు ఉంటారని తెలిపారు. తన సొంత గ్రామం నార్సింపల్లి అభివృద్ధికి డీజీపీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగానే ప్రజాప్రతినిధుల సహకారం కోరారన్నారు. ఈ క్రమంలో మంత్రి సునీత ఇంటికి వెళ్లి గ్రామ అభివృద్ధిపై చర్చించారని తెలిపారు. అభివృద్ధి కాంక్షించే వ్యక్తిపై ఆరోపణలు తగదన్నారు.
మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పోలీసుల సమక్షంలో ఉన్నా కేసు ఎందుకు నమోదు చేశారని విలేకరులు ప్రశ్నించగా...ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో చాలామంది ఆయన అనుచరులే ఉన్నారన్నారు.వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. వారిని ఆపకుండా అలానే నిలబడి ఉన్నారని తెలిపారు. ధ్వంసాన్ని ఆపేందుకు అవకాశం ఉన్నా పోలీసులు స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయని ప్రశ్నించగా...దీనిపై ఇదివరకే చెప్పామంటూ డీఐజీ దాటవేశారు.
సీఐ, ఎస్‌ఐల వీఆర్ ఉత్తర్వులు వెనక్కు తీసుకోలేదు
స్థానిక పోలీసులు నిఘా ఉంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ప్రసాద్‌రెడ్డి హత్య జరిగిందని, ఇందుకు బాధ్యులను చేస్తూ ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ను వీఆర్‌కు పంపారు. మళ్లీ అలానే కొనసాగుతుండడంపై డీఐజీ వివరణ ఇచ్చారు. స్వయంగా పోలీస్‌స్టేషన్ పక్క న ఈ ఘటన చోటు చేసుకుందని, ఈ కారణంగా తక్కిన అధికారులకు మెసేజ్ వెళ్లాలనే ఉద్దేశంతో సీఐ, ఎస్‌ఐను వీఆర్ కు పంపేలా నిర్ణయించామన్నారు. ఉత్తర్వులు తనవద్దే ఉన్నాయని, ప్రసాద్‌రెడ్డి హత్య కేసులో నిందితులు అరెస్ట్ కాగానే వారిద్దరిని వీఆర్‌కు పంపుతామన్నారు.
ఫ్యాక్షన్ రూపుమాపేందుకు కృషి
Published Wed, May 6 2015 5:05 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement
Advertisement