పీలేరు, న్యూస్‌లైన్: ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లర్ల రాక తగ్గిందని అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ అన్నారు. మంగళవారం పీలేరు సర్కిల్ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తిరుమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన విషయం తెలిసిందేనన్నారు. అప్పటి నుంచి సాయుధ బలగాలతోనే కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు కావాలని ఫారెస్ట్ సిబ్బంది కోరారని తెలిపారు. ఇందులో భాగంగా ఆయుధాలను ఎలా ఉపయోగించాలి, వాటి రక్షణ తదితర అంశాలపై ఈ నెల 6 నుంచి తిరుపతి సమీపంలోని కల్యాణిడ్యాం పోలీస్ శిక్షణ కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు.
మొదటి విడతలో 120 మంది హాజరయ్యారని, ఒక్కొక్క బ్యాచ్‌కు రెండు వారాల పాటు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఫారెస్ట్ రేంజ్‌కి ఏపీఎస్‌పీ స్పెషల్ పోలీస్ ప్లాటూన్స్‌ను నియమించామన్నారు. తిరుపతి, ప్రొద్దుటూరు, భాకరాపేట, తదితర ఫారెస్ట్ రేంజ్‌లన్నింటికీ సాయుధ బలగాలను ప్రత్యేకంగా నియమించామన్నారు. ఇకపై కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులపై స్మగ్లర్లు దాడులకు పాల్పడితే ఆత్మరక్షణ కోసం ఆయుధాలను ఉపయోగిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు, అడవిలోకి వెళ్లి చెట్లు నరికే కూలీల తాకిడి తగ్గిందన్నారు. ప్రతి సార్వత్రిక ఎన్నికల్లోనూ పీలేరు నియోజకవర్గంలో అదనపు బలగాలను నియమిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ అవసరం మేరకు నియమిస్తామని తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వాల్మీకిపురం సర్కిల్ పరిధిలోని గుర్రంకొండ పోలీస్ స్టేషన్, పీలేరు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసినట్టు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం క్రైం రేటు తగ్గిందని, లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కడా లేదని, గ్రేవ్ కేసులు బాగా తగ్గాయన్నారు. ఎస్పీ పీహెచ్‌డీ.రామకృష్ణ, మదనపల్లె డీఎస్పీ కేవీ.రాఘవరెడ్డి, పీలేరు సీఐ నరసింహులు, ఎస్‌ఐ ఎస్.విశ్వనాథరెడ్డి, ఇతర ట్రైనీ ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ల రాక తగ్గింది
Published Wed, Jan 22 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement