dig bala krishna
-
ఫ్యాక్షన్ రూపుమాపేందుకు కృషి
సీఐ, ఎస్ఐల వీఆర్ ఉత్తర్వులు వెనక్కు తీసుకోలేదు నిందితులు అరెస్ట్‌కాగానే వీఆర్‌కు పంపుతాం డీఐజీ బాలకృష్ణ అనంతపురం క్రైం : జిల్లాలో ఫ్యాక్షన్ రూపుమాపడానికి పారదర్శకంగా, జవాబుదారితనంగా పని చేస్తున్నామని డీఐజీ బాలకృష్ణ బాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాప్తాడులో జరిగిన ప్రసాద్‌రెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసులో 32 మందిని అరెస్ట్ట్ చేశామని తెలిపారు. ఇంకా పలువురిని గుర్తిస్తున్నామని, వారి ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. ప్రసాద్‌రెడ్డి హత్యఘటన స్థలంలో రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ నేమ్‌ప్లేట్ పడి ఉన్న విషయమై ఆరోపణలు వస్తుండడం బాధాకరమన్నారు. అక్కడికి వచ్చిన ప్రజల్ని నియంత్రించడంలో నేమ్‌ప్లేట్ కిందకుపడిపోయి ఉండవచ్చని తెలిపారు. అంతమాత్రాన ఆయన పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగే డీజీపీపై కూడా ఆరోపణలు చేస్తుండడం సరికాదన్నారు. ఆయన జిల్లా వాస్తవ్యుడు కావడంతో సహజంగానే బంధువులు, మిత్రులు ఉంటారని తెలిపారు. తన సొంత గ్రామం నార్సింపల్లి అభివృద్ధికి డీజీపీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగానే ప్రజాప్రతినిధుల సహకారం కోరారన్నారు. ఈ క్రమంలో మంత్రి సునీత ఇంటికి వెళ్లి గ్రామ అభివృద్ధిపై చర్చించారని తెలిపారు. అభివృద్ధి కాంక్షించే వ్యక్తిపై ఆరోపణలు తగదన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పోలీసుల సమక్షంలో ఉన్నా కేసు ఎందుకు నమోదు చేశారని విలేకరులు ప్రశ్నించగా...ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో చాలామంది ఆయన అనుచరులే ఉన్నారన్నారు.వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. వారిని ఆపకుండా అలానే నిలబడి ఉన్నారని తెలిపారు. ధ్వంసాన్ని ఆపేందుకు అవకాశం ఉన్నా పోలీసులు స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయని ప్రశ్నించగా...దీనిపై ఇదివరకే చెప్పామంటూ డీఐజీ దాటవేశారు. సీఐ, ఎస్ఐల వీఆర్ ఉత్తర్వులు వెనక్కు తీసుకోలేదు స్థానిక పోలీసులు నిఘా ఉంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ప్రసాద్‌రెడ్డి హత్య జరిగిందని, ఇందుకు బాధ్యులను చేస్తూ ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్‌ను వీఆర్‌కు పంపారు. మళ్లీ అలానే కొనసాగుతుండడంపై డీఐజీ వివరణ ఇచ్చారు. స్వయంగా పోలీస్‌స్టేషన్ పక్క న ఈ ఘటన చోటు చేసుకుందని, ఈ కారణంగా తక్కిన అధికారులకు మెసేజ్ వెళ్లాలనే ఉద్దేశంతో సీఐ, ఎస్ఐను వీఆర్ కు పంపేలా నిర్ణయించామన్నారు. ఉత్తర్వులు తనవద్దే ఉన్నాయని, ప్రసాద్‌రెడ్డి హత్య కేసులో నిందితులు అరెస్ట్ కాగానే వారిద్దరిని వీఆర్‌కు పంపుతామన్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్ల రాక తగ్గింది
పీలేరు, న్యూస్‌లైన్: ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లర్ల రాక తగ్గిందని అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ అన్నారు. మంగళవారం పీలేరు సర్కిల్ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తిరుమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన విషయం తెలిసిందేనన్నారు. అప్పటి నుంచి సాయుధ బలగాలతోనే కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు కావాలని ఫారెస్ట్ సిబ్బంది కోరారని తెలిపారు. ఇందులో భాగంగా ఆయుధాలను ఎలా ఉపయోగించాలి, వాటి రక్షణ తదితర అంశాలపై ఈ నెల 6 నుంచి తిరుపతి సమీపంలోని కల్యాణిడ్యాం పోలీస్ శిక్షణ కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. మొదటి విడతలో 120 మంది హాజరయ్యారని, ఒక్కొక్క బ్యాచ్‌కు రెండు వారాల పాటు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఫారెస్ట్ రేంజ్‌కి ఏపీఎస్పీ స్పెషల్ పోలీస్ ప్లాటూన్స్‌ను నియమించామన్నారు. తిరుపతి, ప్రొద్దుటూరు, భాకరాపేట, తదితర ఫారెస్ట్ రేంజ్లన్నింటికీ సాయుధ బలగాలను ప్రత్యేకంగా నియమించామన్నారు. ఇకపై కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులపై స్మగ్లర్లు దాడులకు పాల్పడితే ఆత్మరక్షణ కోసం ఆయుధాలను ఉపయోగిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు, అడవిలోకి వెళ్లి చెట్లు నరికే కూలీల తాకిడి తగ్గిందన్నారు. ప్రతి సార్వత్రిక ఎన్నికల్లోనూ పీలేరు నియోజకవర్గంలో అదనపు బలగాలను నియమిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ అవసరం మేరకు నియమిస్తామని తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వాల్మీకిపురం సర్కిల్ పరిధిలోని గుర్రంకొండ పోలీస్ స్టేషన్, పీలేరు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసినట్టు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం క్రైం రేటు తగ్గిందని, లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కడా లేదని, గ్రేవ్ కేసులు బాగా తగ్గాయన్నారు. ఎస్పీ పీహెచ్డీ.రామకృష్ణ, మదనపల్లె డీఎస్పీ కేవీ.రాఘవరెడ్డి, పీలేరు సీఐ నరసింహులు, ఎస్ఐ ఎస్.విశ్వనాథరెడ్డి, ఇతర ట్రైనీ ఎస్ఐలు, ఏఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.