
సాక్షి, అమరావతి: ఉల్లి కొరతను అధిగమించేందుకు రాష్ట్రానికి ఈజిప్టు ఉల్లిపాయలు దిగుమతి కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, కేరళ, సిక్కిం రాష్ట్రాల్లో ఉల్లి కొరత తీవ్రంగా ఉంది. కొనుగోలుదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్) ద్వారా ఉల్లిని సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఈజిప్టు నుంచి 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లి కొనుగోలుకు ఆర్డరు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తొలిదశలో 2,265 మెట్రిక్ టన్నులను రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. కాగా, రాష్ట్రానికి 1000 మెట్రిక్ టన్నుల ఉల్లిని సరఫరా చేయాలని కోరుతూ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంగళవారం నాఫెడ్‌కు లేఖ రాసింది.
సముద్ర మార్గంలో ఈ ఉల్లిపాయలు దిగుమతి కానుండటంతో డిసెంబర్ 10 తర్వాత రాష్ట్ర కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా రైతుల నుంచి సర్కారు కిలో రూ.55 నుంచి రూ.60లకు కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా రాయితీపై కిలో రూ.25లకు విక్రయిస్తోంది. ఇలా రోజుకు 150 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేస్తోంది. దీనివల్ల ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం పడుతోంది. ధరల స్థిరీకరణ నిధితో మార్కెటింగ్ శాఖ ఈ కొనుగోళ్లను చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment