ఈద్ ముబారక్
కర్నూలు(కల్చరల్): ముప్పై రోజులుగా వినిపించిన ఔటు శబ్దాలు.. కనిపించిన సహేరీ ఇఫ్తార్‌ల సందళ్లు.. గుబాళించిన హలీమ్.. హరీస్‌ల ఘుమఘుమలు... ఇక నేటితో సెలవు చెప్పి వీడ్కోలు పలుకుతున్నాయి. రమ్యమైన రంజాన్ నెల వెళ్లొస్తానంటూ.. మేఘాల మాటున కనిపించీ కనిపించని నెలవంకకు సలాములు చెబుతూ వెళ్లిపోయింది. రంజాన్ చివరిరోజున అందరి మదిలో ఉల్లాసాలు నిండగా దూద్‌సేమియా పండగ వచ్చేసింది. మంగళవారం ఈదుల్ ఫితర్‌ను ముస్లింలు కనులపండువగా నిర్వహించుకోనున్నారు.
సోమవారం సాయంత్రం నగరంలో హిందూ ముస్లింలు ఈద్‌ముబారక్ భాయ్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కరచాలనం చేసుకున్నారు. వన్‌టౌన్, చిత్తారి వీధి, పూలబజార్, చిన్నమార్కెట్ వీధి, గనీగల్లి, ఖడక్‌పుర, పెద్దమార్కెట్ వీధి, పాతబస్టాండ్ సమీపంలోని కొత్తపేట, ఉస్మానియా కాలేజీ వీధి, సంకల్‌బాగ్, మద్దూర్‌నగర్, సి.క్యాంప్, కృష్ణానగర్, అబ్బాస్‌నగర్, అమీన్ అబ్బాస్‌నగర్, వెంకటరమణ కాలనీ తదితర ప్రాంతాల్లో రంజాన్ పండుగ కొనుగోళ్ల సందడి కనిపించింది. అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్, శ్రీనివాస క్లాత్ మార్కెట్, మించిన్‌బజార్‌లలో దుకాణాల వద్ద భారీ సంఖ్యలో మహిళలు గుమిగూడి వస్త్రాలు, టోపీలు, అత్తర్లు కొనుగోలు చేశారు.
ఈద్గాకు వెళ్లే కంటే ముందే ఫిత్రా దానం
ఈదుల్ ఫితర్ రోజున ముస్లిములు పేదలకు ఫిత్రా దానం చేయాలని రోజా మసీదు ఇమాం అబ్దుర్రజాక్ తెలిపారు. ప్రతి నిరుపేద ముస్లిం కుటు ంబం కూడా రంజాన్‌మాసం చివరి రోజైన ఈదుల్‌ఫితర్‌ను జరుపుకునేందుకే ఈ ఫిత్రా దానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత ఈద్గాలో ఉదయం 9:30 గంటలకు కొత్త ఈద్గాలో ఉదయం 10 గంటలకు ఈదుల్‌ఫితర్ నమాజు జరుగుతుందన్నారు.
ముస్తాబైన ఈద్గాలు
నగరంలోని కొత్తబస్టాండ్ సమీపంలోని పాత ఈద్గా, సంతోష్‌నగర్ సమీపంలోని కొత్త ఈద్గా, వన్‌టౌన్‌లోని జమ్మిచెట్టు సమీపంలోని ఈద్గాలు ఈదుల్‌ఫితర్ నమాజు కోసం ముస్తాబయ్యాయి. ఈద్గా ప్రాంగణం శుభ్రపరచి, నీళ్ల సౌకర్యం, షామియానాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సి.క్యాంప్ మీదుగా కొత్తబస్టాండ్‌కు వెళ్లే వాహనాలను హైవే వైపుకు మళ్లించే ఏర్పాట్లు చేస్తున్నారు.