ఎనిమిది నెలల బిడ్డ అపహరణ | Eight months of the child abduction | Sakshi
Sakshi News home page

ఎనిమిది నెలల బిడ్డ అపహరణ

Published Tue, Nov 18 2014 2:36 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

ఎనిమిది నెలల బిడ్డ అపహరణ - Sakshi

ఎనిమిది నెలల బిడ్డ అపహరణ

గాజువాక : అపహరణకు గురైన ఎనిమిది నెలల బాలుడు అదృష్టవశాత్తు ఆటో డ్రైవర్ చెంతకు చేరాడు. ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన అజ్ఞాతవ్యక్తే తిరిగి ఆ బాలుడిని తీసుకెళ్లిపోవడానికి పథకం వేసినప్పటికీ ఆటోడ్రైవర్ భార్య పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తామని చెప్పడంతో మెల్లగా జారుకున్నాడు. ఆ బాలుడిని పోలీసులు చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. గాజువాక పోలీసుల కథనం ప్రకారం.. అక్కిరెడ్డిపాలేనికి చెందిన బొంగు శ్రీరాములు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బేరంపై సోమవారం ఉదయం నగరానికి వెళ్లాడు.

తిరుగు ప్రయాణంలో కేజీహెచ్ వద్ద ఎనిమిది నెలల బాబుతో ఓ వ్యక్తి ఆటో ఎక్కాడు. తన భార్య లేదని, ఎవరైనా పెంచుకోవడానికి ముందుకొస్తే తన కుమారుడిని ఇచ్చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం కుమార్తెను కలిగి ఉన్న శ్రీరాములు ఆ బిడ్డను తనకు ఇస్తే పెంచుకుంటానని చెప్పాడు. అక్కిరెడ్డిపాలెంలోని శ్రీరాములు ఇంటికి వెళ్లి బిడ్డను ఇచ్చి వెళ్లిపోయాడు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మళ్లీ వచ్చిన కిడ్నాపర్ బిడ్డను తనకు ఇచ్చేయాలని కోరాడు. అతడి తీరుపై అనుమానం వ్యక్తం చేసిన శ్రీరాముల భార్య రమణమ్మ బిడ్డను పోలీసుల ద్వారా అప్పగిస్తామని, గాజువాక పోలీస్ స్టేషన్‌కు రమ్మని చెప్పింది. ఆ దంపతులిద్దరూ బిడ్డను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా కిడ్నాపర్ మాత్రం మెల్లగా జారుకున్నాడు.

ఎంతసేపటికీ అతడు పోలీస్ స్టేషన్‌కు రాకపోవడంతో పోలీసులు ైచైల్డ్‌లైన్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న చైల్డ్‌లైన్ టీమ్ సభ్యురాలు కె.శారదాదేవికి బాబును అందజేశారు. తమ బాలుడు అపహరణకు గురైనట్టు పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు తెలిసింది. అక్కడ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తల్లిదండ్రులకు గాజువాక పోలీస్ స్టేషన్‌లో బాబు ఉన్నట్టు తెలియడంతో వారు ఇక్కడి పోలీసులకు ఫోన్ చేసి తమ బిడ్డ వివరాలను, గుర్తులను తెలిపారు. అన్ని ఆధారాలతో మంగళవారం వస్తే బిడ్డను అందజేస్తామని పోలీసులు, చైల్డ్‌లైన్ ప్రతినిధి స్పష్టం చేశారు. అంతవరకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా శిశు గృహంలో ఉంచుతామని ఈ సందర్భంగా శారదాదేవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement