ఆధార్‌ బేజార్‌ | EKYC Registration Problems In Vizianagaram District | Sakshi
Sakshi News home page

ఆధార్‌ బేజార్‌

Published Sun, Aug 25 2019 10:08 AM | Last Updated on Sun, Aug 25 2019 10:09 AM

EKYC Registration Problems In Vizianagaram District - Sakshi

ఆధార్‌ నమోదుకు కాంప్లెక్స్‌ వద్ద మీసేవ కేంద్రంలో బారులు తీరిన జనం

అమ్మ ఒడి పథకానికి అర్హత కోసం చిన్నారి పేరు ఆధార్‌లో నమోదు కావాలి. పెన్షన్‌కు అర్హత సాధించాలంటే వయసు ధ్రువీకరణ కోసం అవసరమైన మార్పులు ఆధార్‌లో చేయించుకోవాలి. అంతేనా... రేషన్‌ సరకులు కోసం ఈ కేవైసీ చేయించుకోవాలంటే ఆధార్‌ కేంద్రంలో వేలిముద్రలు వేయించుకోవాలి. ఇన్ని అవసరాలకు కారణమైన ఆ ఆధార్‌ కోసం ఇప్పుడు బేజారు పెరిగింది. ఒక్కసారిగా జనమంతా ఆధార్‌ కేంద్రాలు నిర్వహిస్తున్న మీ సేవ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు అక్కడి జనాన్ని చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

సాక్షి, విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ఆధార్‌ నమోదు వ్యవహారం ప్రహసనంలా మారింది. ఈకేవైసీ నమోదులో భాగంగా ఆధార్‌ నమోదు కేంద్రాలపై ఒత్తిడి పెరగ్గా అందుకు తగ్గ కేంద్రాలు లేకపోవడం... ఉన్నవి కాస్తా మూతపడటం... వాటిని పునరుద్ధరించేందుకు ఉడాయ్‌ స్పందించకపోవడం ఈ సమస్యకు కారణ మైంది. ఇప్పుడు ఆధార్‌ నమోదుకోసం జనం కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. పరిస్థితిని గమనించిన అధికారులు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ఈకేవైసీ నమోదుకు గడువు లేదని స్పష్టం చేస్తూ విద్యార్థులకు పాఠశాలల్లోనే నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

 ఇన్నాళ్లూ నమోదు చేసుకోకే...
ప్రతి వ్యక్తికి ఏకీకృత గుర్తింపు సంఖ్య(యుఐడీ) జారీ చేస్తున్న విషయం తెలిసిందే. వేలిముద్రలు, కంటిపాపలు, ఇతర వివరాలు సేకరిస్తున్న సంగతీ తెలిసిందే. ఈ పక్రియ గత ఐదారేళ్లుగా నిరంతరం సాగుతోంది. అప్పట్లో తీసుకోని వారు, పిల్లలు పుట్టి, పెరిగిన తర్వాత వారు నమోదు చేసుకోవాల్సి ఉం ది. ఇలా ఇప్పటికీ ఆధార్‌ నమోదు చేసుకోని వారు చాలామంది ఉన్నారు. కొం దరికి అప్పట్లో తల్లితండ్రి పేరున ఆధార్‌ నంబర్‌ జారీ చేసినా వేలిముద్రలు సేకరించలేదు. పిల్లల వయస్సు ఐదేళ్లు దాటిన తర్వాత వారికి ఆధార్‌ చేయించాల్సి ఉన్నా చేయలేదు.

ఈకేవైసీ నమోదుతో ఆధార్‌కు పరుగులు..
తాజాగా ప్రభుత్వం ఈకేవైసీ నమోదు చేసుకోవాలని సూ చించడంతో నమోదుకు రేష న్‌ డీలర్ల వద్ద ఈకేవైసీ కోసం వెళ్లగా పిల్లల వేలిముద్రలు పడట్లేదు. వారి ఆధార్‌ నమోదు కాకపోవడం ఇం దుకు కారణం. ఆధార్‌ చేయించుకోని కొందరు పెద్దవారి పరిస్థితీ ఇంతే. ఈ పరిస్థితుల్లో తొలుత ఆధార్‌ నమోదు చేసుకోవాల్సి రావడంతో వారంతా ఆధార్‌ నమోదు కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇంకా 1.83లక్షల మంది ఈకేవైసీ నమోదు కావాల్సి ఉండడంతో రోజూ ఆధార్‌ తీసే మీసేవ కేంద్రాల వద్ద గంటల కొద్దీ వేచి ఉంటున్నారు. అయినా ఆధార్‌ జరగకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.

 కేంద్రాల సంఖ్య తగ్గడంవల్లే ఇబ్బందులు..
డిమాండ్‌కు తగ్గట్టుగా ఆధార్‌ కేంద్రాలు లేకపోవడంతో వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 36 శాశ్వత, 10 తాత్కాలిక నమోదు కేంద్రాలను ఈసేవ, మీసేవ కేంద్రాల్లో అప్పట్లో ఏర్పాటు చేశారు. కానీ అందులో ఇప్పుడు కేవలం 19 మాత్రమే పని చేస్తున్నాయి. తాత్కాలిక కేంద్రాలను ఆపేయగా సరైన డాక్యుమెంట్లు స్కాన్‌ చేయకపోవడం, నిర్దేశిత రుసుం కంటే ఎక్కువ వసూలు చేయడం, సూపర్‌వైజర్‌ లాగిన్‌ లాక్‌ చేయడం వంటి కేంద్రాలతో శాశ్వత కేంద్రాల్లో 17 నిలుపుదల చేశారు. వీటిని తెరిపించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ రెండుసార్లు ఉడాయ్‌ అధికారులకు లేఖలు రాసినా వారు స్పందించలేదు. పాతవి పునరుద్ధరించకపోగా కొత్తవి కూడా మంజూరు చేయలేదు. దీనివల్ల ఇప్పుడు ప్రజలు అవస్థలు పడుతున్నారు.

వేలాదిగా తరలివస్తున్న జనం..
విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న ఈ సేవ కేంద్రానికి శనివారం ఒక్కరోజే నాలుగువేల మంది వచ్చి ఉదయం నుంచి బారులు తీరారు. దీనివల్ల కాసేపు అక్కడ తోపులాట చోటు చేసుకుంది. అక్కడికి వచ్చిన వారు తోసుకున్నారు. లైన్లో ఉన్న వారికి మానేసి పక్కనుంచి వచ్చిన వారికి ఇస్తున్నారని ఆందోళన చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపు చేయాల్సి వచ్చింది. చివరకు నిర్వాహకులు అందరికీ ఆధార్‌ చేయలేక ఆక్టోబర్‌ 25వ తేదీ వరకు రోజుకు 50మంది చొప్పున టోకెన్లు ఇచ్చి పంపేశారు. అయినా ఇంకా చాలామంది టోకెన్లు లభించక నిరాశతో వెనుదిరిగారు. ఉదయం నుంచి ఉన్నా తమ పని కాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి జిల్లాలోని మిగతా కేంద్రాలవద్ద కూడా ఉండటం విశేషం.

స్పందించిన అధికారులు..
జనం పడుతున్న అవస్థల నేపథ్యంలో అధికారులు స్పందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈకేవైసీ చేయించుకోకుంటే కార్డులు తొలిగించమని ఇప్పటికే సంయుక్త కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రభుత్వం గడువు ఏమీ విధించలేదని తాజాగా వెల్లడించారు. అంతేగాకుండా ఐదేళ్ల నుంచి 15ఏళ్ల లోపు పిల్లలకు పాఠశాలల్లోనే ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌ చేస్తామని తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈకేవైసీ రేషన్‌ డిపోల్లో డీలర్ల వద్దే చేయించుకోవాలన్నారు. ఇక ఆధార్‌కోసం పిల్లల్ని తీసుకుని మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. 

ఈకేవైసీ లేకున్నా... రేషన్‌..
ఈకేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్‌ సరుకులు ఇవ్వరన్నది వాస్తవం కాదని, నమోదు చేయించుకోకున్నా రేషన్‌ ఇస్తామని సంయుక్త కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15ఏళ్ల వరకు ఉన్న వారికి పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ చేయించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తర్వాత రేషన్‌ డీలర్‌ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవచ్చని చెప్పారు. వీరంతా ఆధార్‌ నమోదు కేంద్రానికి రావాల్సిన అవసరం లేదన్నారు. ఈకేవైసీ చేయించుకునేందుకు ఎలాంటి గడువు లేదని, ఎప్పుడైనా చేయించుకోవచ్చనీ స్పష్టం చేశారు. 15సంవత్సరాలు దాటిన వారు ఆధార్‌ కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, రేషన్‌ డీలరే ఈకేవైసీ చేస్తారనీ, ప్రజలు ఈవిషయాన్ని గమనించాలని కోరారు.
-జేసీ వెంకటరమణారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement