ఈసీ ఆదేశాలనే ధిక్కరిస్తారా? | Election Commission Admonition to AP CS Anil Chandra Punetha | Sakshi
Sakshi News home page

ఈసీ ఆదేశాలనే ధిక్కరిస్తారా?

Published Tue, Apr 2 2019 4:54 AM | Last Updated on Tue, Apr 2 2019 9:59 AM

Election Commission Admonition to AP CS Anil Chandra Punetha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని, ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించరాదని తాము జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించి ఆయనను తిరిగి అదే పదవిలో నియమిస్తూ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) అనిల్‌చంద్ర పునేత జీవో జారీ చేయడంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్‌ ఆదేశాల మేరకు వెంకటేశ్వరరావును తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 716ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? తిరిగి ఆయననే డీజీ ఇంటెలిజెన్స్‌గా నియమిస్తూ జీవో 720 ఎందుకు జారీ చేశారు? ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లంఘించడాన్ని ఎలా పరిగణించాలి? అని ఈసీ ప్రశ్నించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) అనిల్‌చంద్ర పునేతను ఈసీ వివరణ కోరింది. దీంతో అనిల్‌చంద్ర పునేత సోమవారం ఢిల్లీలో ఈసీని కలిసి వివరణ ఇచ్చారు. ‘కమిషన్‌ ఆదేశాలు వచ్చిన తక్షణమే ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, వైఎస్సార్‌ కడప జిల్లాల ఎస్పీలు వెంకటరత్నం, రాహూల్‌ దేవ్‌ శర్మను బదిలీ చేస్తూ జీవో నంబరు 716  జారీ చేశాం. తర్వాత ఇంటెలిజెన్స్‌ డీజీ ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి రారంటూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) పంపిన నోట్‌ ఫైల్‌ మేరకే జీవో 721 జారీ చేశాం. దీని ప్రకారమే ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావు బదిలీని రద్దు చేసి మిగిలిన ఇద్దరు ఎస్పీల బదిలీలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు జీవో నంబరు 720 జారీ చేశాం ’ అని సీఎస్‌ అనిల్‌చంద్ర పునేత వివరణ ఇచ్చినట్లు తెలిసింది.

డీజీపీ నోట్‌ ఫైల్‌ పంపితే ఆ విషయం మా (ఈసీ) దృష్టికి తీసుకొచ్చి అనుమతి తీసుకోకుండా బదిలీ ఉత్తర్వులను ఎలా రద్దు చేస్తారు? డీజీపీగానీ, మరొకరుగానీ ఏది చెబితే అది చేసేస్తారా? ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఎలా సవాల్‌ చేస్తుంది? అని ఈసీ నిలదీసినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకోకుండా జీవో ఇవ్వడం తొందరపాటు చర్యేనని, ఇకమీదట ఇలా జరగనీయబోమంటూ సీఎస్‌ సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు వెంకటేశ్వరరావును బదిలీచేసిన ప్రభుత్వం 24 గంటలు గడవకముందే ఆయనను తిరిగి అదే స్థానంలో నియమించడం, కమిషన్‌ నిర్ణయాన్ని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టులో సవాల్‌ చేయడం ఈసీకి ఆగ్రహం తెప్పించింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించడమే కాకుండా ఈసీ ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్‌ డీజీ పోస్టు నుంచి తప్పించి పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబడుతూ వివరణ అడగడంతోపాటు ఇందుకు దారితీసిన పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కమిషన్‌ అధికారులు వాకబు చేసినట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement