కుటుంబ సభ్యులంతా ఒకే చోట ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం సరికొత్త ఆలోచన చేసింది. ఈ విధానంతో వారంతా ఒక పోలింగ్ స్టేషన్‌లోనే ఇక నుంచి ఓటు వేసుకోనున్నారు. ఇందుకోసం బీఎల్వోలు జిల్లా అంతటా చురుగ్గా సర్వే చేపడుతున్నారు. గతంలో ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు చోట్ల ఓటు వినియోగించుకుని ఇబ్బందులు పడేవారు. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టే దిశగా ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకువచ్చింది.
పాలకొండ రూరల్/రేగిడి/సరుబుజ్జిలి/ఆమదాలవలస: కొద్ది కాలం క్రితం ఎపిక్ నోషనల్ నెంబరింగ్ మొబైల్ యాప్ ద్వారా క్షేత్ర స్థాయిలో బీఎల్వోలకు శిక్షణ ఇచ్చారు. వీరు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను మొబైల్ యాప్ ద్వారా అప్‌లోడ్ చేసి ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకువస్తున్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాతోపాటు ప్రతి ఇంటినీ జియో ట్యాగ్ చేసి గూగుల్ ఎర్త్‌కి అనుసంధానం చేస్తున్నారు. ఆ ఇంటికి ఒక నంబర్ కేటాయించి ఆ కుటుంబంలోని ఓటర్లను జియో ట్యాగ్ చేయనున్నారు. దీనివల్ల కుటుంబ సభ్యులంతా ఒకేచోట ఓటు వేయడమే కాకుండా బోగస్ ఓట్లకు చెక్ పెట్టే అవకాశం ఉంది. గూగుల్ ఎర్త్‌లో ఇప్పటికే నమోదైన ఇంటి నంబర్ల ఆధారంగా పోలింగ్ కేంద్రాలకు స్పష్టమైన హద్దులు ఏర్పడనున్నాయి. గూగుల్ ఎర్త్‌లోనే ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని గృహాలన్నీ స్థానికంగా ఉన్న పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకువస్తారు. దీనివల్ల ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికే వెళ్లి ఓటు వినియోగించుకునేవకాశం ఉంటుంది.
స్థానిక ఎన్నికల నాటికి సిద్ధం..?
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు నాటికి ఈ నూతన విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు ఎన్నికల యంత్రాంగం కృషి చేస్తోంది. దీంతో ఇప్పటికే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రతి బీఎల్వోకు ఆండ్రాయిడ్ మొబైల్ అందించి ఈ యాప్ అప్‌లోడ్ చేసి గ్రామాల్లో సర్వేలు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై బీఎల్‌వోలకు శిక్షణ ఇస్తున్నారు.
ప్రతి ఇల్లు జియో ట్యాగ్..
పోలింగ్ కేంద్రాలలోని ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేయడం ద్వారా గూగుల్ ఎర్త్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేక చిత్రాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో వలంటీర్లు, శిక్షణ సర్వేయర్ల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని గృహాలను జియో ట్యాగ్ చేస్తున్నారు. ప్రతి ఇంటిని గూగుల్ ఎర్త్‌లో గుర్తించి ప్రత్యేకించి ఒక నెంబరు కేటాయించారు. ఈ నెంబర్ల ఆధారంగా ప్రస్తుతం బీఎల్వోలు సదరు ఇళ్లలోని ఓటర్లను జియోట్యాగ్ చేస్తున్నారు. ఒక కుటుంబంలోని ఓటర్లకు సంబంధించిన నెంబర్లన్నీ ఒకే ఇంటి నెంబరుకు పిన్ చేస్తున్నారు. దీంతో అందులోని ఓటర్లను వేర్వేరుగా ఇతర పోలింగ్ కేంద్రాలకు కేటాయించే అవకాశం ఉండదు. దీంతోపాటు గుర్తింపు కార్డుల నెంబర్లు, పూర్తి వివరాలతో కూడిన డేటాను అనుసంధానం చేస్తుండటంతో బోగస్ ఓట్లను సులభంగా గుర్తించే వీలుంటుంది.
గందరగోళం లేకుండా ఉంటుంది..
గతంలో ఒక కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ బూత్‌లలో ఉండడం వలన ఓటింగ్‌కు తీవ్ర ఇబ్బందులు కలిగేవి. జాబితాల్లో ఇంటి పేరు, భర్త పేరు, అడ్రస్‌లు కూడా సక్రమంగా ఉండేవి కావు. దీనివలన ఓటరు గందరగోళానికి గురయ్యేవాడు. ప్రస్తుతం ఈ నూతన విధానం వలన కుటుంబం మొత్తం ఒకే చోట, ఒకేసారి ఓటు చేసి ఇంటికి రావచ్చు. దీనివలన బోగస్ ఓట్లు రద్దవుతాయి.
– ఎస్.నాగేశ్వరరావు, కొత్తకోట, సరుబుజ్జిలి
మంచి ప్రక్రియ..
గతంలో ఎవరి ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో వెతుక్కోవడం ఇబ్బందిగా ఉండేది. తండ్రి ఓటు ఒక ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో ఉంటే పిల్లల ఓటు వేరే ప్రాంతంలో ఉండేవి. ఇప్పుడలా కాకుండా కుటుంబంలోని సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలోకి తీసుకురానుండడం మంచి ప్రక్రియ. అలాగే ఓటరు గుర్తింపు కార్డుల నెంబరు డేటాతో అనుసంధానం చేయడం వలన బోగస్ ఓట్ల గుర్తింపు సులభతరమవుతుంది.
– చందక జగదీష్‌కుమార్, మాజీ సర్పంచ్, తంపటాపల్లి, పాలకొండ మండలం
90 శాతం పూర్తి చేశాం..
కుటుంబ సభ్యులందరూ ఒకేచోట ఓటు వేసేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిని, అందులో ఉండే సభ్యుల వివరాలను జియోట్యాగ్ చేస్తున్నాం. ఈ నెల 30వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే రెవెన్యూ సబ్ డివిజన్‌లో 90 శాతం మేర జియోట్యాగ్ జరిగింది. గడువులోగా శతశాతం పూర్తి చేస్తాం.
–టి.వి.ఎస్.జి.కుమార్, ఆర్డీవో, పాలకొండ
Comments
Please login to add a commentAdd a comment