సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఏర్పాట్లపై కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం అన్ని జిల్లా కలెక్టర్లతో కేంద్ర డిప్యుటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ, పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడం, రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం, ఈవీఎంల లభ్యత, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించనున్నారు.