పౌరుషాల గడ్డ ..మాచర్ల | Election special Macherla Constituency overview | Sakshi
Sakshi News home page

పౌరుషాల గడ్డ ..మాచర్ల

Published Fri, Mar 22 2019 1:12 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Election special Macherla Constituency overview - Sakshi

మాచర్ల నియోజకవర్గ ముఖచిత్రం

సాక్షి, మాచర్ల : జీవప్రదాయినిగా పేరొందిన నాగార్జున సాగర్‌ జలాశయాన్ని గుండెలపై పెట్టుకున్నా.. గుక్కెడు మంచినీళ్లకు అల్లాడుతున్న నియోజకవర్గం మాచర్ల. పల్నాటి పౌరుషాల కత్తుల నెత్తుటి మరకల్లో తడిచి ఫ్యాక్షన్‌ రంగు పులుముకుని.. అభివృద్ధి ఆనవాళ్లను మరిచిన ప్రాంతమిది.  ఇక్కడ శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆశీస్సులతో ఎందరో రాజకీయ నాయకులు తమ ఉనికిని చాటుకున్నారు.

మరెందరో ఓటర్ల మనసులు గెలుచుకున్నారు. ఒకే కుటుంబంలో వారే ప్రత్యర్థులై రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేశారు. మూడు దఫాలు విజయాన్ని సాధించి నియోజకవర్గంలో సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులు తమ సత్తా చాటేందుకు ఎత్తుగడ వేస్తున్నారు.

నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. అప్పటి నుంచి 2014 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గ పునర్వివిభజన సమయంలో రెంటచింతల మండలంలోని మిట్టగుడిపాడు, మంచికల్లు, రెంటాల, రెంటచింతల గ్రామాలు గురజాల నియోజకవర్గం నుంచి మాచర్ల నియోజకవర్గంలోకి మారాయి. మొత్తం ఐదు మండలాల్లో మాచర్ల మండలంలోని విజయపురిసౌత్, తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ సరిహద్దుగా ఉంటుంది.

కారంపూడి మండలంలోని దక్షిణం వైపు చక్ర సిమెంట్స్‌ తరువాత వినుకొండ నియోజక వర్గంలోని రెడ్డిపాలెం ప్రారంభమవుతుంది. వెల్దుర్తి మండలంలోని దావుపల్లి తరువాత ప్రకాశం జిల్లాకు చెందిన యర్రగొండపాలెం సరిహద్దుగా ఉంటుంది. రెంటచింతల మండలంలో ఒక వైపు గురజాల నియోజకవర్గం సరిహద్దుగా ఉంటుంది. మరోవైపున కృష్ణానది ఉంది. నాగార్జున సాగర్, గుంటూరు హైదరాబాద్, నర్సరావుపేట, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కలుపుతూ రహదారులున్నాయి. 


విజేతల వివరాలు

  • నియోజకవర్గంలో 1962లో రంగమ్మరెడ్డిపై కాంగ్రెస్‌ తరఫున కేశవ నాయక్‌ గెలుపొందాడు.
  • 1967లో జూలకంటి నాగిరెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి వెన్నా లింగారెడ్డి 64 ఓట్లతో విజయం సాధించారు.
  • 1972లో కాంగ్రెస్‌ అభ్యర్థి లింగారెడ్డిపై స్వతంత్ర అభ్యర్థి జూలకంటి నాగిరెడ్డి 12 వేల ఓట్ల తేడాతో గెలిచారు.
  • 1978లో జూలకంటి నాగిరెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా నారపరెడ్డి విజయం సాధించారు. 1983లో కాంగ్రెస్‌ అభ్యర్థి నారపరెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొర్రపాటి సుబ్బారావు 26 వేల మెజార్టీతో గెలిచారు.
  • 1985లో కాంగ్రెస్‌ అభ్యర్థి నట్టువ కృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వట్టికొండ జయరాంపై 1750 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
  • 1989లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మగడ్డ శివరామకృష్ణ.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నట్టువ కృష్ణ పై 4300 ఓట్లతో గెలుపొందారు.
  • 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కుర్రి పున్నారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి సుందరరామిరెడ్డిపై 5600 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
  • 1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి జూలకంటి దుర్గాంబ.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై 1750 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
  • 2004లో తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి పిన్నెల్లి లక్ష్మారెడ్డి 31 వేల పైచిలుకుతో గెలుపొందారు.  
  • 2009లో జూలకంటి బ్రహ్మారెడ్డిపై కాంగ్రెస్‌ తరఫున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 9600 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
  • 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సాఆర్‌ సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిరుమామిళ్ల మధుబాబుపై 16200 ఓట్ల ఆధికత్యతో విజయం సాధించారు.
  • 2014లో వైఎస్సాఆర్‌ సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొమ్మారెడ్డి చలమారెడ్డిపై 3535 ఓట్ల ఆధికత్యతో గెలిచారు.

 నియోజకవర్గంలోని ఐదు మండలాలు

  • మాచర్ల మండలంలోని 15 పంచాయతీల్లో 17 శివారు గ్రామాలున్నాయి.
  • రెంటచింతల మండలంలో 11 పంచాయతీల్లో 3 శివారు గ్రామాలున్నాయి.
  • దుర్గి మండలంలో 14 పంచాయతీల్లో 8 శివారు గ్రామాలున్నాయి.
  • కారంపూడి మండలంలో 15 పంచాయతీల్లో 8 శివారు గ్రామాలున్నాయి.
  • వెల్దుర్తి మండలంలో  16 పంచాయతీల్లో 16 శివారు గ్రామాలున్నాయి. 

సామాజిక వర్గాల వివరాలు 
రెడ్లు : 33000
కమ్మ సామాజిక వర్గం : 29000
ఎస్‌సీ మాదిగ :  24000
మాలలు :  9000
యాదవులు : 19000
వడ్డెరలు :15000
ముస్లింలు, దూదేకులు : 20,000
ఆర్యవైశ్యులు :  13,000
సుగాలీలు, చెంచులు, గిరిజనులు :19,000
నాయుడులు : 14,000

ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు
వెనుకబడిన నియోజకవర్గంలో సాగు, తాగు నీటి పథకాలు లేవు.  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరికపూడిసెల, దమ్మర్ల గొంది, జెర్రివాగు, 100 పడకల ఆసుపత్రి, గొలివాగు ఎత్తిపోతల పథకంతోపాటు అనేక అంశాలు ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి. యాదవ, వడ్డెర, కాపు, ముస్లిం, ఆర్యవైశ్య సామాజిక వర్గాలు గెలుపును నిర్ణయిస్తాయి. 

ప్రత్యేకతలు
నియోజకవర్గ పరిధిలో నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ కుడికాలువ ఉంది. విజయపురిసౌత్‌ పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతోంది. విజయపురిని రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకులు పరిపాలించారు. నాగార్జున కొండలో ప్రస్తుతం బుద్ధిజం చరిత్ర జ్ఞాపకాలు మ్యూజియంలో పెట్టారు. బ్రహ్మనాయుడు పునఃనిర్మించిన శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయం ఇప్పటికీ ఉంది. వెల్దుర్తి, మాచర్ల రూరల్, దుర్గి మండలాల్లో సాగు, తాగునీటి సమస్య ఎక్కువ. వరికపూడిసెల ప్రాజెక్టు కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతోంది. నియోజకవర్గం పక్కనే ఉన్న నల్లమల అడవులు వేదికగా నక్సల్స్‌ ఉద్యమాలు చేపట్టారు. వెల్దుర్తి, గొట్టిపాళ్ళ, శిరిగిరిపాడు, వేపకంపల్లి, గుండ్లపాడు గ్రామాలు ఫ్యాక్షన్‌ చరిత్ర కలిగి ఉన్నాయి. 

నియోజకవర్గ జనాభా : 3,76,946
పురుషులు : 1,94,456
స్త్రీలు : 1,82,490
మొత్తం ఓటర్లు : 2,40,670
పురుషులు : 1,19,582
స్త్రీలు : 1,21,054
ఇతరులు : 34
పోలింగ్‌ బూత్‌లు : 299
సమస్యాత్మకమైన బూత్‌లు : 58 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement