సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థలన్నీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంటే మరొక సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంది. ఉన్న వాటికే దిక్కు లేకుంటే.. కొత్త సంస్థల ఏర్పాటు వల్ల ప్రయోజనం ఏం ఉంటుందనే అభిప్రాయం వినపడుతోంది. ఆయా సంస్థల కార్యాలయాల్లో కనీసం ఫర్నీచర్ లేని పరిస్థితులు ఉన్నాయని అధికార పార్టీకి చెందిన చైర్మన్, పాలకమండలి సభ్యులుగా నియమితులైన వారే వాపోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నాయకులకు రాజకీయ ఉపాధి కల్పించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వినపడుతోంది.
సిబ్బంది ఉండదు.. నిధులు ఉండవు..
రాష్ట్రంలో అనంతపురం, గోదావరి, కర్నూలు, మచిలీపట్నం, నెల్లూరు, తిరుపతి, విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలతో పాటు ఏపీ సీఆర్‌డీఏ, విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ, విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు ఉన్నాయి. వీటికితోడు కొత్తగా ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఒకటి, రెండు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు మినహా ఎక్కడా పరిస్థితులు సానుకూలంగా లేవు. 2016లో ఏర్పాటైన నెల్లూరు, కర్నూలు, అనంతపురం, గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు ప్రభుత్వం ఇంత వరకు పూర్తిస్థాయి సిబ్బందిని సైతం నియమించలేదు. వాటికి చైర్మన్‌లుగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల వరకు ప్రత్యేక చాంబర్లు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును అనేక సార్లు కలసి పట్టణాభివృద్ధి సంస్థలకు నిధుల కొరత వేధిస్తోందని గోడు వెళ్లబోసుకున్నారు. ఎట్టకేలకు 2017లో ఒక్కో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి రూ. 50 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే టౌన్‌ప్లానింగ్, ఎస్టేట్, ఇంజినీరింగ్ వంటి ముఖ్య విభాగాలకు సిబ్బంది కొరత వెన్నాడుతోంది. అక్కడి పట్టణాభివృద్ధి సంస్థల్లో అసలు పని ఉండటం లేదని తెలుసుకున్న అధికారులు, ఉద్యోగులు అక్కడ పని చేయడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఎవరినైనా ప్రభుత్వం నియమించినా, ఆ అధికారి డబ్బులు ఖర్చు చేసుకుని మరీ అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
పలుకుపడి ముందు ‘ప్రకాశం’ పక్కకు..
ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీతో పాటు ప్రకాశం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి కూడా అధికారులు ప్రతిపాదనలను రూపొందించారు. అయితే ఏలూరు అథారిటీ ఏర్పాటులో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సీఎం వద్ద తనకున్న పలుకుబడితో దాన్ని వెంటనే ఏర్పాటు చేయించుకున్నారని చెబుతున్నారు. ఏలూరు నగరపాలక సంస్ధతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలను కలిపి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే పట్టణాభివృద్ధి సంస్థలకు నిధుల కొరత వెన్నాడుతోన్న నేపథ్యంలో ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థకు కూడా అవే సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రకాశం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రతిపాదనలు మాత్రం ప్రభుత్వం వద్ద పరిశీలనలోనే ఉండిపోయిందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయ కారణాలతో అథారిటీ
మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసి చైర్మన్‌ను నియమించినా.. సిబ్బంది నియామకం ఇంకా జరగలేదు. చైర్మన్‌గా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకుడు బూరగడ్డ వేదవ్యాస్‌కు ఇప్పటివరకు ప్రత్యేక కార్యాలయమే ఏర్పాటు కాలేదు. దీని ఏర్పా టు వెనుక రాజకీయపరమైన అంశం ఇమిడి ఉందనే విమర్శలు పార్టీలో లేకపోలేదు. పెడన సీటును ఆశిస్తున్న వేదవ్యాస్‌ను ఆ పోటీ నుంచి తప్పించేందుకే సీఎం చంద్రబాబు హడావుడిగా మచిలీపట్నం అథారిటీని ఏర్పా టు చేసి, ఆయన్ను చైర్మన్‌గా నియమించారని రాజకీయ వర్గాల్లో వినప డుతోంది. ఇలా టీడీపీ నాయకులకు రాజకీయ పునరావాసం కోసం ఈ అథారిటీలను ఉపయోగిం చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment