పచ్చ కుట్ర!
సాక్షి ప్రతినిధి, కడప :
తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ కక్షసాధింపునకు తెగబడుతున్నారు. ఇందుకు పోలీసు యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తోంది. జిల్లా స్థాయి పోలీసు అధికారులు నిబంధనల మేరకు పనిచేయాలని ప్రయత్నిస్తున్నా.. ఉన్నతాధికారుల ఆదేశాలను ఏకపక్షంగా అమలు చేయాల్సి వస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.
ఎమ్మెల్యే తనయులే టార్గెట్!
అధికార పార్టీకి విపక్ష ఎమ్మెల్యేల తనయులే టార్గెట్ అయ్యారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ తాజాగా ఓ ఎమ్మెల్యే తనయునిపై రౌడీషీట్ ఓపెన్ చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. అయితే నిబంధనల మేరకు అది సాధ్యం కాదని ఇక్కడి యంత్రాంగం తెలిపినట్లు సమాచారం. ఇటు కాకపోతే.. అటు నుంచి నరుక్కు వస్తాం అన్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడిపెంచి వారి ద్వారా ఆదేశాలు ఇప్పించినట్లు తెలుస్తోంది.
‘దేశం’ నేతల ఒత్తిడితో డీజీపీ ఆదేశం
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయాల్సిందిగా డీజీపీ ఆదేశించడంతోనే కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ వెంకట అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. పనిలో పనిగా దేవగుడి గ్రామంలో ఏకంగా 35 మందిపై రౌడీషీట్ తెరిచారు. ఆ సంస్కృతి జమ్మలమడుగు నుంచి ఇప్పుడు మైదుకూరుకు పాకింది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డితోపాటు మరో అయిదుగురిపై రౌడీషీట్ తెరవాలని ఓ టీడీపీ నేత నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో రాష్ట్ర మంత్రి ద్వారా ఉన్నతాధికారులకు సిఫారసులు చేస్తున్నట్లు వినికిడి. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా.. కుట్రపూరిత ఆలోచనలతో అడుగులు వేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా...
ఓ వ్యక్తిపై ఏడాదిలో రెండు కేసులు నమోదై ఉంటే రౌడీషీట్ ఓపెన్ చేయాలని పోలీసు మాన్యువల్ సూచిస్తోంది. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించిన నేరాలు, భౌతిక దాడులు, బెదిరింపులు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి కేసుల్లో కనీసం ఏడాదిలోపు రెండు వాటిల్లో ఉండాలి. అయితే ఎమ్మెల్యేల ఇద్దరి తనయులపైనా అలాంటి కేసులేవీ లేవు. అయినా రౌడీషీట్లు తెరుస్తున్నారు. ఎన్నికల్లో వివాదాస్పద అంశాన్ని పరిగణలోకి తీసుకొని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డితోపాటు 35 మందిపై రౌడీషీట్ తెరిచారు. ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డితోపాటు మరో ఐదు మందిపై నమోదు చేసేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం.
గిరిజనులపై దాడులు చేస్తున్నా...
ఓవైపు విపక్ష పార్టీ నేతలపై రౌడీషీట్లు తెరుస్తున్న పోలీసు యంత్రాంగం ఇంకోవైపు గిరిజనులపై దాడులు చేస్తుంటే మాత్రం కళ్లుమూసుకుంటోంది. అందుకు కారణం అక్కడి పాత్రధారులు కూడాతెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కావడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. పులివెందులలో గిరిజనులకు చెందిన వారి ఇళ్లపై దాడులు జరిగి పది రోజులు గడుస్తున్నా ఎలాంటి కేసూ నమోదు కాలేదు. పోలీసు యంత్రాంగం ఇలా అధికార బలం ఉన్నవాడికి ఒకలా.. లేనివాడికి మరోలా చూడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.