రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు | Emergency Situation in Andhra Pradesh: YS Vijayamma | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు

Published Fri, Aug 16 2013 1:31 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

Emergency Situation in Andhra Pradesh: YS Vijayamma

* పంద్రాగస్టు వేడుకల్లో విజయమ్మ ఆవేదన
* కోట్లాది మంది రోడ్లెక్కుతున్నా పట్టదా?
* ప్రజలే సైన్యంగా మారే రోజులు తొందర్లో వస్తాయి
* కాంగ్రెస్ కుట్రలకు వారే తెరదించుతారు
* అధికార పార్టీ ఓట్లు, సీట్లే లక్ష్యంగా వ్యవహరిస్తోంది
* ఏ ఒక్కరితో చర్చించకుండా తనకు తాను నిర్ణయాలు తీసుకుంటోంది
* ఇరు ప్రాంతాలకు సర్దిచెప్పాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి
* కాంగ్రెస్ వైఖరికి నిరసనగానే ఆమరణ దీక్ష
 
సాక్షి, హైదరాబాద్: గత పక్షం రోజులుగా రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం పట్టడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే ఎమర్జెన్సీ పాలన తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలు ఏమాత్రం పట్టకుండా ఓట్లు, సీట్లే లక్ష్యంగా అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈనెల 19న విజయవాడలో ఆమరణ దీక్షకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రజలే సైన్యంగా మారి  కాంగ్రెస్ కుట్రలకు తెరదించే రోజులు తొందర్లోనే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

67 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం పార్టీ కార్యాలయంలో విజయమ్మ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు, ప్రజా ఆందోళనలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ప్రసంగం ఆమె మాటల్లోనే...

తండ్రిలా న్యాయం చేయాలని అడుగుతున్నాం..
కేంద్రంలో అధికారంలో ఉన్న వారు తండ్రిలా న్యాయం చేయాలని అడుగుతున్నాం. రాష్ట్రంలో అందరితో చర్చించాలని అడుగుతున్నాం. కానీ మనం అడిగే ప్రశ్నలకు కేంద్రం, కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసే పరిస్థితిలేదు. ఒక ప్రాంతానికి మంచి చేయడమంటే గర్వించదగినదే. కానీ ఇతర ప్రాంతాలను గురించి ఆలోచన చేయకుండా కేవలం ఓట్లు, సీట్ల కోసం నిర్ణయాలు తీసుకోవడం దారుణం. ఏ ఒక్కరితో చర్చించకుండా తనకు తాను నిర్ణయాలు తీసేసుకుంటోంది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విషయాలను పెడచెవిన పెట్టింది.

ఇరు ప్రాంతాలకు న్యాయం చేయని పక్షంలో విభజించే హక్కు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నాం. న్యాయం చేయలేని పక్షంలో యథాతథంగా ఉంచాలని కోరుతున్నాం. తెలంగాణకు న్యాయం జరిగితే మంచిదే, అడ్డుపడే వాళ్లం కూడా కాదు. కానీ రెండు ప్రాంతాలకు సర్దిచెప్పాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. జటిలమైన సమస్యలకు జవాబు చెప్పాలి. అయితే కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపడంలేదు. కేంద్రం.. ఒక తండ్రిలా బిడ్డలందరికీ సమ వాటాలు పంచివ్వాలి. వారి నిర్ణయం అలా లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్లు, సీట్ల ప్రాతిపదికన ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తామనే ఆలోచనతోనే ఉంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రభావం భవిష్యత్తు తరాలపై కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది.

వైఎస్ ఆకాంక్ష.. పేదవాడి ముఖంలో చిరునవ్వు
ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు. పేదవాడికి ప్రభుత్వం భరోసా ఉండాలని కోరుకున్నారు. మాటలే కాదు చేతల్లో కూడా చేసి చూపించారు. రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, 108, 104, ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, పేద విద్యార్థులు ఉన్నత చదవులు అభ్యసించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులు గర్వంగా తలెత్తుకొని బతికేందుకు ఉచిత విద్యుత్, కరెంటు బకాయిలు ఎత్తేయడం, రుణమాఫీ వంటి కార్యక్రమాలు చేశారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు, గ్రామీణ ఉపాధి, ఉద్యోగాలు ఇలా పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకొచ్చే ఎన్నో ప్రయత్నాలు చేశారు.

వైఎస్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు మేలు చేసే సీఎంగా నిలబడ్డారు. ఆయన ఏనాడు కూడా ఒక ప్రాంతానికి మంచి చేయడం కోసం మరో ప్రాంతానికి హాని తలపెట్టే ఆలోచన చేయలేదు. మూడు ప్రాంతాల్లో కూడా ప్రాజెక్టులు చేపట్టి సాగునీరు, తాగునీరు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లాకో విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజీ, జేఎన్‌టీయూ, ఐఐటీ, ఐఐఐటీ, బిట్‌‌సిపిలానీ, జేకేసీ ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో ప్రఖ్యాత కంపెనీలను తీసుకొచ్చారు.

హైదరాబాద్‌ను కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డు, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే, అంతర్జాతీయ విమానాశ్రయం, కృష్ణా జలాలు, మెట్రోరైల్ ఇలా ఎన్నో చేశారు. సంక్షేమ పథకాల ద్వారా మనిషికి కావాల్సినవన్నీ ఇచ్చారు. శాచ్యురేషన్ పద్ధతిలో అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందేందుకు కృషి చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆయన ఉండుంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేది.

రాజ్యాంగ అధికారాలు దుర్వినియోగం..
అభియోగాల మీద విచారణ కూడా చేయకుండా జనం మధ్యలో ఉన్న జగన్‌బాబును 15 నెలలుగా అక్రమంగా నిర్భంధించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ వారు సైతం ఇలా చేసుండరు. సీబీఐని చేతిలో పెట్టుకొని, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పరిపాలన సాగిస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను దుర్వినియోగ పరుస్తూ, ఈ రోజు ఎమర్జెన్సీ పరిస్థితులను తలపించేలా చేస్తున్నారు. వ్యతిరేకంగా ఉన్న వారిని జైల్లో పెడుతున్నారు.

చంద్రబాబు మద్దతుతోనే అడ్డగోలు విభజన
రాష్ట్రానికి సంబంధించి గత కొంత కాలంగా రకరకాల వార్తలు వెలువడుతున్నా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు అన్నీ తెలిసినా ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ముందే కేంద్రాన్ని హెచ్చరించి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. మా ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు వారు చేసుంటే కేంద్రంపై ఒత్తిడి పెరిగి జూలై 30న విభజనపై తొందరపాటు ప్రకటన వచ్చి ఉండేది కాదు. అయితే  చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళపరుస్తున్నారు.

2008, 2012లో ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసిన మాదిరిగా లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని ఇష్టమున్నట్లు విభజించుకోండని చెప్పారు. చంద్రబాబు సహకారం వల్లే విభజన ప్రకటన వచ్చింది. అన్ని ప్రాంత ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని గట్టిగా ఎందుకు చెప్పలేకపోయారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి జలాల విషయంలో చిక్కుముడులున్నాయి. విభజన వల్ల కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీరు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలి.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామంటున్నారు కానీ దానికి నీరు ఎక్కడ్నుంచి వస్తోంది? అలాగే శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి కూడా అంతే. వీటికి జవాబేలేదు. ఈ రోజు రాష్ట్రంలోని ప్రతీ గ్రామం నుంచి పది మందికి పైగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఇలా ఏదో ఒక విధంగా హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇలా అరవై ఏళ్లుగా ఉంటున్న వారి విషయంలో కేసీఆర్ మాటలు చూస్తే భయాందోళనలు కలుగుతున్నాయి. అంతేకాదు రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచే రూ.90 వేల కోట్ల ఆదాయం లభిస్తోంది.

రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సంక్షేమ పథకాలు ఏ విధంగా నడిపించాలి. పరిస్థితులు అంతా ఈ విధంగా ఉంటే చంద్రబాబు మాత్రం... నాలుగు లక్షల కోట్లు ఇస్తే అన్ని సర్దుకొని వెళ్లిపోతాం. కొత్త రాజధాని నిర్మించుకుంటామంటున్నారు. చంద్రబాబు తోడుగా ఉన్నారనే కాంగ్రెస్ ముందూవెనక ఆలోచన చేయకుండా విభజన చేస్తోంది. పైగా సీమాంధ్రకు సంబంధించి రాజధాని విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చిచ్చుపెడుతోంది. కర్నూలు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు అంటూ ఒక్కోసారి ఒక్కో పేరు చెబుతూ ఇక్కడ కూడా విద్వేషాలు రగిలిస్తోంది.
 
అందుకే దీక్ష చేస్తున్నా...
కాంగ్రెస్ పార్టీ ఒక వైపు తెలంగాణ ప్రక్రియ ఆగదు అంటూనే మరోవైపు ఏమైనా సమస్యలుంటే ఆంటోని కమిటీకి చెప్పండని అంటోంది. ఆ కమిటీ కూడా రాష్ట్రానికి రాదట! ఢిల్లీ వచ్చి చెప్పమంటోంది. ఇప్పటిదాకా ప్రణబ్ కమిటీ, రోశయ్య, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలన్నీ చూశాం. ఆంటోనీ కమిటీ వల్ల న్యాయం జరుగుతుందని నమ్మకం లేకనే జగన్‌బాబు, నేను పదవులకు రాజీనామా చేశాం. పది, పదిహేను రోజులుగా ఇన్ని కోట్ల మంది రోడ్లెక్కి ఉద్యమం చేస్తున్నా.. ఎన్జీవోలు పెన్‌డౌన్ చేస్తున్నా కాంగ్రెస్‌కు పట్టడం లేదు. అందుకే నేను ఈనెల 19 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆకాంక్షిస్తుంది.. ప్రజల మధ్య అసూయకు తావు లేకుండా ఉండాలనేదే మా ధేయ్యం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement