ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఎన్‌జీవో సంఘ రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషొత్తమ నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఎన్‌జీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాదులో ఉన్న ఏపీ ఎన్‌జీవో సంఘ కార్యాలయం.. ఏపీ ఎన్‌జీవోలు డొనేట్ చేసి నిర్మించుకున్న కార్యాలయం అని, అది ప్రైవేటు ఆస్తి అన్నారు. దీనిపై హైదరాబాదులోని కలెక్టర్ పెత్తనాన్ని ఖండిస్తున్నామన్నారు.
ఈ విషయం సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రం ఇవ్వనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ప్రభుత్వం రెండు డీఏ బకాయిలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఐదేళ్లుగా ఎంతో కష్టపడి సాధించుకున్న హెల్త్‌కార్డులు విషయంలో.. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం తగదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50శాతం వేతనం ఇస్తామని చెప్పారని, ఇది ఎవరికి వర్తిస్తుందో, ఎవరికి వర్తించదో తెలియడం లేదన్నారు. ఈ జీవోను తక్షణమే సరిదిద్దాలన్నారు.
ఏపీ ఎన్‌జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూనే ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులకు 20శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తామని చెప్పి ఏడాదిన్నర అయిందని, సీఎం హామీకే దిక్కులేదన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్‌జీవో సంఘ ప్రతినిధులు చల్లా శ్రీనివాసరావు, బమ్మిడి హరికృష్ణ, ఆర్.వేణుగోపాల్, ఎల్.జగన్మోహనరావు, బమ్మిడి నర్సింగరావు, రామ్మోహనరావు, బి.పూర్ణచంద్రరావు, ఏజెఎం రాధాకృష్ణ, బి.మధుసూధనరావు పాల్గొన్నారు.