
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ఎన్జీవో ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పది రోజుల్లో పీఆర్సీ సమస్య పరిష్కరిస్తామని స్వయంగా సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. ఈలోపే ఉద్యోగ సంఘాల నేతలు కొందరు బ్లాక్ మెయిల్‌కు దిగటం ఏమిటని ప్రశ్నించారు. తమ వద్ద 60 లక్షల ఓట్లు ఉన్నాయని ఉద్యోగ నేత అనడం దేనికి సంకేతమని అన్నారు. సీఎం జగన్ అడిగిన 10 రోజులు గడువు ముగియకముందే అల్టిమేటం ఎందుకు ఇచ్చారని, సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకొంటే బాగుంటుందని చెప్పారు.
ఉద్యోగులే ప్రభుత్వ రథ సారథులని, వారు బాగా పనిచేస్తున్నారని సీఎం జగన్ చెప్తున్నారన్నారు. ఈ పరిస్థితిలో ఉద్యోగ నేతలు ఇలా వ్యవహరించటం సరికాదన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ అన్ని విధాల కృషి చేస్తారన్నారు. ఉద్యోగులకు జీతాలు ఎక్కడ రావడంలేదో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పాలన్నారు. నాయకులు సంయమనం పాటించాలని కోరారు. లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్లే ఇక్కడా జరుగుతుందని చురకలు అంటించారు. తర్వాత ఉద్యోగ సంఘాల నేతలే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులను ఇంత మంచిగా చూసుకొనే సీఎం ఎక్కడా ఉండరని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్ చాలా విషయాల్లో పెద్ద పీట వేశారన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు ఆలోచించి అడుగులు వేయాలన్నారు.