
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ప్రైవేటీకరణకు యాజమాన్యం మరో అడుగు ముందుకేస్తూ.. సిబ్బంది కుదింపు యత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఇంజినీరింగ్ విభాగంలో సిబ్బందిని కుదించింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీల్లేకుండా.. ప్రైవేటు సిబ్బందిని నియమించుకునేలా తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. గురువారం గుట్టుచప్పుడు కాకుండా జారీచేసిన ఈ ఉత్తర్వులపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. తొలి దశలో డ్రైవర్ల నియామకాలకు పచ్చ జెండా ఊపింది. ఆర్టీసీ అధికారులు వినియోగిస్తున్న వాహనాలకు ప్రైవేటు సిబ్బందిని నియమించుకునేలా జారీచేసిన ఉత్తర్వులపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సిబ్బంది కుదింపు చర్యల్లో ఇది భాగమేనని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. గత ఐదేళ్లలో ఆర్టీసీలో 12 వేల మంది సిబ్బంది పదవీ విరమణ చేసినా.. ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయకపోవడాన్ని బట్టి చూస్తే సిబ్బందిని తగ్గించే ఎత్తుగడకు ఇది నిదర్శనంగా పేర్కొంటున్నారు. ఆర్టీసీలో అధికారులు, సంస్థ సొంతంగా వినియోగించే వాహనాలకు ప్రైవేటు డ్రైవర్లను నియమించుకునేందుకు యాజమాన్యం జారీచేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోకుంటే ఆందోళనబాట పడతామని యూనియన్ నేతలు శుక్రవారం హెచ్చరించారు.
సిబ్బంది కుదింపునకు సకల యత్నాలు
వీఆర్‌ఎస్‌ను తెరపైకి తెచ్చి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కు తగ్గిన యాజమాన్యం.. ఆర్టీసీ నష్టాలకు కార్మికులే కారణమని వారిని తగ్గించేందుకు పలు యత్నాలు చేస్తోంది. ఒకేసారి అన్ని విభాగాల్లో పోస్టుల్ని కుదిస్తే కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి ఒక్కో విభాగంలో రెగ్యులర్ పోస్టులకు ఎసరు పెడుతోంది. దీంతో ఇకపై ఏ విభాగంలో ఖాళీలున్నా భర్తీ చేసేది లేదని తేల్చి చెబుతోంది. కేవలం డ్రైవర్ ఉద్యోగాలనే కారుణ్య నియామకం కింద చేపడతామని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భారీ వాహన లైసెన్స్ పొందేందుకు అభ్యర్థులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రైవేటీకరణ దిశగా వేగంగా ముందుకెళుతున్న ఆర్టీసీ.. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు నాలుగువేల మంది కండక్టర్ల ఉద్యోగాలను భర్తీ చేయలేదు.
ఇంజినీరింగ్‌లో 40% పోస్టుల కుదింపు
ఆర్టీసీలో ప్రధానంగా ఆపరేషన్స్, మెకానికల్, పర్సనల్, సివిల్ ఇంజినీరింగ్, సోŠట్‌ర్స్ అండ్ పర్చేజ్ విభాగాలున్నాయి. ఆపరేషన్స్ విభాగంలో ఇప్పటివరకు ఒక్క కండక్టర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 40 శాతం పోస్టుల్ని ఏకంగా రద్దు చేసింది. ఇకపై ఈ పోస్టుల్ని భర్తీ చేసేది లేదని ఏకంగా నోటిఫికేషన్ జారీచేసింది. ఆర్టీసీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు కలిపి మొత్తం రాష్ట్రంలో 133 మంది ఉన్నారు. వీటిలో 54 పోస్టుల్ని రద్దు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. అంటే ఈ విభాగంలో 40 శాతం పోస్టుల్ని రద్దు చేసిందన్నమాట. 54 పోస్టుల్లో 38 పోస్టుల్ని ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అనుమతిచ్చారు. పోస్టుల అవసరం లేకుంటే ఔట్ సోర్సింగ్‌లో ఎందుకు భర్తీ చేస్తున్నారన్న ప్రశ్న కార్మిక సంఘాల నుంచి వ్యక్తం కావడం గమనార్హం. ఆర్టీసీలో ఇంజినీరింగ్ విభాగానికి ప్రాధాన్యం ఉంది. బస్టాండ్ల నిర్మాణం, బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల నిర్వహణ తదితరాలన్నీ ఈ విభాగం నిర్వహించాల్సిందే. ఎలక్ట్రిక్ పనులనూ ఈ విభాగమే పర్యవేక్షించాలి. అటువంటి కీలక విభాగంలో పోస్టుల్ని రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.
ప్రైవేటు సిబ్బందిని నియమించుకునేందుకు గురువారం ఆర్టీసీ యాజమాన్యం జారీచేసిన సర్క్యులర్
ఆర్టీసీ ఉద్యోగుల చర్చలు 22కి వాయిదా
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి జరుగుతున్న చర్చల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విజయవాడలోని ఆర్టీసీ భవన్‌లో ఐదోసారి జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. జనవరి 22న మరోసారి భేటీ కావాలని యాజమాన్యం, గుర్తింపు సంఘం నేతలు నిర్ణయించారు. 20 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని యాజమాన్యం ప్రకటించగా, 50 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని గుర్తింపు సంఘం ఎంప్లాయిస్ యూనియన్ నేతలు పట్టుబట్టారు. 50 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వకపోతే సమ్మెకు వెనుకాడబోమని ఈయూ నేతలు యాజమాన్యానికి తేల్చి చెప్పారు. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఈ నెల 22న మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. ఇప్పటివరకు జరిగిన చర్చల ద్వారా అంగీకరించిన కారుణ్య నియామకాల ప్రక్రియను ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తామని యాజమాన్యం హామీనిచ్చింది. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ వెంటనే చేస్తామని ఎండీ సురేంద్రబాబు హామీనిచ్చారు. 2016 లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఈ నెల 24న చెల్లించేందుకు అంగీకరించారు. అయితే ఫిట్‌మెంట్‌పై యాజమాన్యానికి, గుర్తింపు సంఘానికి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో శనివారం అన్ని కార్మిక సంఘాలతో సమావేశం కావాలని నిర్ణయించామని ఈయూ నేతలు దామోదరరావు, వైవీ రావులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment