ఎమ్మిగనూరు రూరల్: దండయాత్ర పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఉపాధ్యాయులు
గోనెగండ్ల: కొత్త పెన్షన్ విధానం సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వంపై పోరుబాట తప్పదని యూటీఎఫ్ మండల అధ్యక్షకార్యదర్శులు జిక్రియ, నరసింహులు అన్నారు. గురువారం స్థానిక బస్టాండ్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో యూటీఫ్ మండల గౌరవాధ్యక్షుడు రామ్మోహన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సీపీఎస్ విధానం రద్దు కోసం ఉపాధ్యాయులు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు యూటీఎఫ్ ప్రత్యేక కార్యాచణ రూపొందించిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి ఆగష్టు 5వ తేదీ వరకు జీపుజాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో మొదలయ్యే ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుందన్నారు.
ఆగష్టు 5న విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాఘవేంద్ర ఆధ్వర్యంలో సీపీఎస్ మండల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా లింగన్న, కో–కన్వీనర్‌గా రామచంద్ర, ఉసేన్, సభ్యులుగా శ్రీనివాసరెడ్డి, పురుషోత్తంతోపాటు మరో నలుగురిని ఎన్నుకున్నారు. సమావేశంలో యూటీఎఫ్ నాయకులు శాంతిరాజు, కాశయ్య, నాయక్, పౌల్, రంగన్న, నాగేశ్వరరావు, నజీర్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
14న సీపీఎస్‌పై దండయాత్ర
ఎమ్మిగనూరు రూరల్: సీపీఎస్‌పై ఈ నెల 14న జరపతలపెట్టిన దండయాత్రను జయప్రదం చేయలని ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు కోరారు. గురువారం దండయాత్రకు సంబంధించిన పోస్టరును విడుదల చేశారు. ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని చెప్పారు. ఈ నెల 14న కర్నూలులోని కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు చేపట్టే భారీ ర్యాలీకి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు రాముడు, రామకృష్ణ, నారాయణ, పరుశరాము, ప్రేమకుమార్, రంగన్న, హేమంత్‌కుమార్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment