నేతలకు ఉపాధి
► రూ.కోట్లు కొల్లకొడుతున్న అధికార పార్టీ నాయకులు
► సహకరిస్తున్న అధికారులు
► సోషల్ ఆడిట్‌లో వెలుగుచూస్తున్న నిజాలు
► రికవరీ ఊసే లేదు
ఉదయగిరి : జాతీయ ఉపాధిహామీ పథకం పనుల్లో అవినీతికి పాల్పడిన అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నా తిరిగి రాజకీయ నేతల సిఫార్సులతో తక్కువ వ్యవధిలోనే విధుల్లో చేర్చుకుంటుండటంతో పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండటంలేదు.
యంత్రాలతో చేయించి..
జిల్లాలోని 42 మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలులో ఉంది. కొన్ని మండలాల్లో కూలీల చేత చేయిం చాల్సిన పనులను యంత్రాలతో చేయించడం, బినామీ మస్టర్లు వేయటం, పనులు చేయకుండానే రికార్డుల్లో చేసినట్లుగా నమోదుచేస్తున్నారు. ఊటకుంటలు, చెక్‌డ్యాంలు, ఇతర సామగ్రి పనుల్లో భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. మూడేళ్లనుంచి ఈ పనుల్లో అవినీతిస్థాయి భారీగా పెరిగింది.
► దుత్తలూరు మండలంలో గతేడాదిలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో అంతులేని అవినీతి చోటుచేసుకుంది. ఇక్కడ రూ.10.57 కోట్లతో పనులు జరగ్గా, అందులో రూ.5.94 కోట్లు అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనికి బాధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఎంపీడీఓను కూడా విధుల నుంచి తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయించిన పలువురు సిబ్బందిపై, సప్లయ్‌దారులపై ఆర్‌ఆర్ యాక్ట్‌కింద కేసులు చేసి రికవరీకి ఆదేశించారు. కానీ రాజకీయ జోక్యంతో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. రికవరీలు చెల్లించలేదు. దీనివెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనే విష యం స్పష్టం.
► బాలాయపల్లి మండలంలో గతేడాది జరిగిన రూ.11.63 కోట్ల ఉపాధి పనులకు సంబంధించి గత జూన్‌లో సామాజిక తనిఖీ నిర్వహించగా రూ.3 కోట్లు అవినీతి జరిగినట్లు తేలింది. ఇందులో డ్వామా అధికారులు రూ.25 లక్షలు రికవరీ పెట్టారు. కానీ ఇంతవరకు రికవరీ చెల్లించలేదు.
► ఈనెల 19వ తేదీన సీతారామపురం మండలంలో జరిగిన సామాజిక తనిఖీల్లో రూ.9.84 కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించారు. డ్వామా అధికారులు ఈ అవినీతిని కప్పెట్టి రూ.87 లక్షలు వివిధ వర్గాలనుంచి రికవరీకి ఆదేశించారు. దీనికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
రికవరీ ఎప్పుడో..?
ఉపాధిహామీ పనులు జరిగిన ఈ పదేళ్లలో ఎనిమిదిసార్లు సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి జరిగిన పనులను చూశారు. వీరి తనిఖీల్లో రూ.కోట్లు అవినీతి జరిగినట్లుగా గుర్తించి నివేదికలు ఇచ్చినప్పటికీ డ్వామా అధికారులు బహిరంగ చర్చావేదికల్లో తగ్గించి చూపిస్తున్నారు. ఈ పథకం జిల్లాలో ప్రారంభమైన నాటినుంచి నేటివరకు రూ.6.25 కోట్లు రికవరీకి ఆదేశాలిచ్చారు. కానీ ఇంతవరకు అందులో సగం కూడా వసూలుకాలేదు. పైగా రాజకీయ నాయకుల సిఫార్సులతో పలువురు సిబ్బం ది, సప్లయ్‌దారులు తమపై విధించిన రికవరీలను భారీగా తగ్గించుకుంటున్నారు.
రికవరీలు కట్టిస్తున్నాం
ఉపాధిహామీలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. నిధులు రికవరీ పెడుతున్నాం. ఇప్పటికే కొంత మొత్తంలో రికవరీ కట్టించాం.ఉపాధి సిబ్బందికి సంబంధించి జీతాల్లో కట్‌చేసి రికవరీకి జమ చేస్తున్నాం. తప్పుచేసిన వారిపై చర్యలు తప్పవు.
– హరిత, డ్వామా పీడీ