అంతా అనుకున్నట్టుగానే సాగునీటి సంఘాల్లో టీడీపీ నాయకులు దొడ్డి దారిన పాగావేశారు. ఎన్నికలు నిర్వహిస్తే ఎక్కడ
ముగిసిన నీటి సంఘాల ఎంపిక
ఇక మిగిలింది డీసీ, టీసీల ఎంపికే
విశాఖపట్నం : అంతా అనుకున్నట్టుగానే సాగునీటి సంఘాల్లో టీడీపీ నాయకులు దొడ్డి దారిన పాగావేశారు. ఎన్నికలు నిర్వహిస్తే ఎక్కడ అభాసుపాలవుతామోననే ఆందోళనతో చరిత్రలో తొలిసారి ఎంపిక విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ రైతుల నుంచి తీవ్ర నిరసనలు, వ్యతిరేకతలు ఎదురైనా.. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా అన్నదాతల ముసుగులో పచ్చచొక్కాలకు అప్పగించారు. మెజార్టీ రైతుల అభిప్రాయాలను పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు అధికార పార్టీ నేతలు ఇచ్చిన జాబితాలకు ఒకే చేశారు. ఈ నెల 10న మొదలైన ఈ ఎంపిక ప్రక్రియ 28 వరకు సాగింది. ఇక తాండవ పరిధిలోని ఐదు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, తాండవ, కోనం, రైవాడ పరిధిలోని పీసీలకు నూతన కమిటీల ఎంపిక చేయాల్సి ఉంది. జిల్లాలో సాగునీటి సంఘాలకు కొత్త కమిటీలొచ్చాయి. ఈ మేరకు ఎంపిక ప్రక్రియ ముగిసింది. అధికార పార్టీ నాయకులకే పదవులు దక్కాయి. ఎన్నికల విధానాన్ని పక్కన పెట్టి తొలిసారిగా ఎంపికకు తెరతీసిన సర్కార్ దొడ్డిదారిన పాగా వేసింది. జిల్లాలో మైనర్ ఇరిగేషన్ సెక్టార్ పరిధిలోని 327, మీడియం ఇరిగేషన్ పరిధిలోని 18, మేజర్ ఇరిగేషన్‌పరిధిలోని 23 సాగునీటి సంఘాల ఎంపిక ప్రక్రియను మమా అనిపించారు. కీలకమైన డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎంపిక జరగాల్సి ఉంది.
అన్నదాతలపై పట్టు పెంచుకునేందుకు ఉపయోగపడే ఈ కమిటీలు తమ పార్టీ అధీనంలోనే ఉండాలన్న సంకల్పంతో ఎన్నికల స్థానంలో సర్వసభ్య సమావేశాలు నిర్వ హించి మేనేజ్‌మెంట్ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రతీ సంఘ పరిధిలో సమావేశం నిర్వహించి ఆరుగురు మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. ఆ పేర్లను జాబితాల నుంచి ఒకర్ని అధ్యక్షునిగా, మరొకర్ని ఉపాధ్యక్షునిగా ఎంపిక చేసి ప్రభుత్వామోదం కోసం పంపించారు. ఈ ఎంపిక ప్రక్రియ పూర్తిగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిల సూచనలకునుగుణంగానే జరిగింది. సుమారు 150 సంఘాల పరిధిలో మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుల ఎంపికలో తీవ్ర గందరగోళ పరి స్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల ఘర్షణలు..తోపులాటలు సైతం చోటుచేసుకున్నాయి. సుమారు 15 చోట్ల సంఘాల ఎంపిక సమయంలో రణరంగాన్ని తలపించాయి. ఎంపిక ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా నక్కపల్లి, కోటవురట్ల, చోడవరం పరిధిలోని సంఘాల సభ్యుల ఎంపికలో రైతుల ప్రమేయం లేకుండా చేర్పులు, మార్పులు చేశారు. తాండవ పరిధిలోని కొన్ని సంఘాలకైతే ఇరిగేషన్ శాఖ డివిజనల్ కార్యాలయంలోనే జాబితాలు రూపకల్పన జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంకేతికపరమైన సమస్యలు ఎదురైనా కొన్ని చోట్ల మేనేజ్‌మెంట్ కమిటీ ఇన్‌చార్జిలుగా అధికారులనే నియమించి తుది జాబితాలను ప్రకటించారు.
అధికారులు మాత్రం అన్ని సంఘాలు మెజార్టీ రైతుల ఏకాభిప్రాయంతోనే మేనేజ్‌మెంట్ కమిటీల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశామని ప్రకటించారు. కేవలం 28 సంఘాల పరిధిలోనే సర్వసభ్య సమావేశ సమయంలో ఏకాభిప్రాయం కుదరలేదని, ఆతర్వాత వాటికి కూడా రైతులు సూచించిన జాబితాలను ప్రభుత్వానికి పంపించామని ఇరిగేషన్ ఈఈ మల్లికార్జున రావు సాక్షికి తెలిపారు. తాండవ పరిధిలో ఉన్న ఐదు డీసీలకు అక్టోబర్ 2, 4 తేదీల్లో ఎంపిక ప్రక్రియ చేపడతామని, తాండవ, రైవాడ, కోనం పరిధిలోని పీసీల ఎంపిక ను 5వ తేదీన జరుగు తుందన్నారు.