గుడిని మింగే దొంగలు! | Endowment officials misuse devotees donations in andhra pradesh | Sakshi
Sakshi News home page

గుడిని మింగే దొంగలు!

Published Fri, Dec 27 2013 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

గుడిని మింగే దొంగలు!

గుడిని మింగే దొంగలు!

భక్తుల విరాళాలు అధికారుల జేబుల్లోకి..
ఇరవై ఏళ్లుగా ఆ శాఖలో ఆడిట్ లేదు..  తనిఖీలు, సమీక్షలూ శూన్యం
తాజా కమిషనర్ విచారణలో బట్టబయలు
కట్టడి చేసేందుకు కమిషనర్ యోచన

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యం భక్తులతో కిటకిటలాడే ప్రధాన దేవాలయాలకు దాతలు, భక్తులు సమర్పించే విరాళాలు పక్కదారి పడుతున్నాయి. అందులో కొందరి విరాళాలతో మాత్ర మే కార్యక్రమాలు జరుగుతాయి. మిగతా సొమ్ము కొందరు అధికారులు, సిబ్బంది జేబులోకి వెళ్తుంది.. కానీ, అన్ని విరాళాలూ ఎప్పటికప్పుడు వ్యయమవుతున్నట్లుగా లెక్కలు తయారవుతుంటాయి.. ఈ అక్రమాలు బయటపడతాయనే భయం అసలేలేదు.. దానికి కారణం తనిఖీలు, సమీక్షలు లేకపోవడమే.. ఈ శాఖలో ఏకంగా 20 ఏళ్లుగా ఆడిటింగే జరగకపోవడంతో అక్రమాలేవీ బయటపడటం లేదు.

అధికారులు దొంగ బిల్లులతో భారీ ఎత్తున నిధులు స్వాహా చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 33 వేల దేవాలయాలను పర్యవేక్షిస్తున్న దేవాదాయ శాఖలో దాదాపు ఇరవై ఏళ్లుగా ఆడిటింగ్ జరగటం లేదు. దాంతో భక్తుల నుంచి భారీగా వస్తున్న విరాళాలను తప్పుడు బిల్లులతో అధికారులు స్వాహా చేస్తున్నారు. ఈ క్రమంలో లోకల్ ఫండ్ ఆడిటింగ్ పేర తూతూమంత్రంగా కథ నడుపుతున్నారు. ఉన్నతాధికారులెవరూ దృష్టిసారించకపోవడంతో.. ఇది మరిం త విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఆదాయం ఎక్కువగా ఉన్న ఆలయాల బాధ్యతలు తీసుకునేందుకు అధికారులు పోటీపడి మరీ పోస్టులు దక్కించుకుంటున్నారు.

ఇందుకోసం నేతలకు భారీగా ‘సమర్పించు’ కుంటున్నారు కూడా. కొద్ది నెలల కిందట డిప్యూటీ కమిషనర్ల బదిలీ సమయంలోనూ ఈ తరహా తంతు నడిచింది. తొలుత ఇచ్చిన పోస్టింగులను చివరి నిమిషంలో మార్చి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ముక్తేశ్వరరావు విచారణలో ఈ బాగోతాలన్నీ వెలుగు చూశాయి. గత 20 ఏళ్లుగా దేవాలయాల్లో తనిఖీలు లేవని, సమీక్షలు జరగలేదని కూడా వెల్లడైంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్... దేవాదాయ శాఖకు ప్రత్యేకంగా విధివిధానాలు అవసరమనే అభిప్రాయాన్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తేవటంతో ఇప్పుడా కసరత్తు మొదలైంది. ఈ మేరకు పలు అంశాలపై చేపట్టాల్సిన చర్యలను సూచించనున్నారు.
 
ప్రత్యేక విధి విధానాలకు కసరత్తు

  ఇక నుంచి దేవాలయాల ఆదాయ, వ్యయాలపై పూర్తిస్థాయిలో ఆడిట్ నిర్వహిస్తారు. ఆ ఆడిట్ ఎలా ఉండాలనే దానిపై విశ్రాంత అధికారులతో అధ్యయనం చేయిస్తున్నారు.
  6 సీ స్థాయి పరిధిలో రాష్ట్రంలో దాదాపు 24 వేల దేవాలయాలున్నాయి. వాటిలో పనిచేస్తున్న అర్చకులకు జీతాలను సరాసరిన చేతికే అందిస్తున్నారు. దాంతో గుడుల ఆదాయం తగ్గిందంటూ సిబ్బందికి జీతాలు తక్కువగా ఇస్తూ నిధులను స్వాహా చేస్తున్నారు. దాంతో ఇక నుంచి అర్చకుల పేర బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిల్లోనే జీతాలు జమ చేస్తారు.
  దేవాలయాల పరిధిలోని భూములు, లీజుల వివరాలు.. స్థిర, చరాస్తులకు సంబంధించి ఇప్పటివరకు డేటా బ్యాంకు లేదు. దాంతో అధికారులు భూములను, లీజు సొమ్మును కాజేస్తున్నారు. ఇక ఆలయాలకు ప్రత్యేక డేటాబేస్‌ను రూపొందిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement