కారు అదుపుతప్పి.. అనంతలోకాలకు
కారు అదుపుతప్పి.. అనంతలోకాలకు
Published Tue, Jul 18 2017 7:01 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
- ఇద్దరికి తీవ్ర గాయాలు
- త్రుటిలో తప్పించుకున్న మరో ఇద్దరు
గండేపల్లి (జగ్గంపేట) : ఏడీబీ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయపడ్డారు. ఈ సంఘటనలో మరో ఇద్దరికి ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానిక ఎసై కె.దుర్గా శ్రీనివాసరావు కథనం ప్రకారం మండలంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీకాకుళానికి చెందిన యవ్వారి మనోజ్‌కుమార్ (21), అనకాపల్లికి చెందిన రవిరాజు ఈఈఈ ఫైనల్ ఇయర్, రాజోలుకు చెందిన కంచి కౌశిక్ మెకానికల్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. పెద్దాపురం బ్యాంక్ కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ కళాశాలకు రోజు వెళ్లి వస్తుంటారు. సోమవారం రవిరాజుకు చెందిన కారులో స్నేహితుడైన కౌశిక్‌ను కళాశాలలో డ్రాప్ చేసేందుకు కళాశాల సమీపంలోకి వచ్చి వెనుదిరిగి పెద్దాపురం బయలుదేరారు.
లలిత గొడౌన్ వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కాలువలోంచి దూసుకెళ్లి గొడౌన్ గేట్ వద్ద చెట్టును, పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది షెల్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ముగ్గురు కారులో చిక్కుకుపోయారు. గొడౌన్‌కు చెందిన పలువురు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందజేశారు. అప్పటికే మనోజ్‌కుమార్ మృతి చెందినట్టు అంబులెన్స్ సిబ్బంది తెలిపింది. తీవ్ర గాయాలతో ఉన్న రవిరాజు, కౌశిక్‌లను పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఏఎస్సై వరహాలరాజు వివరాలు సేకరించారు. ప్రస్తుతం రవిరాజు పరిస్థితి విషమంగా ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
భీతిల్లిన సిబ్బంది
షెల్టర్‌లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది.. ఈ ప్రమాదంతో భీతిల్లారు. ఒక్కసారిగా పెద్దగా శబ్దం రావడంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. షెల్టర్‌ను కారు ఢీకొనడంతో తమకు ప్రమాదం తప్పిందని పడాల శ్రీనివాస్, మద్దాల విలియం తెలిపారు.
కారణం.. అతివేగమా? రోడ్డుపై బురదేనా?
విద్యార్థులు ప్రయాణం చేస్తున్న కారును వేగంగా నడపడంతో ఈ ప్రమాదం సంభవించిందా...లేక రోడ్డుపై బురద కారణమా అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లోనే రోడ్డు నునుపుగా ఉంటుందని, వర్షం పడడం, ఈ రహదారిలో గ్రావెల్‌ను తరలిస్తున్న లారీ డ్రైవర్లు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రోడ్డుపై గ్రావెల్ పడుతోందని అంటున్నారు. దీంతో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ ఎన్. సతీష్‌రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు చేపట్టారు. మనోజ్ కుమార్ మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కాకినాడలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వైద్యులతో మాట్లాడారు.
Advertisement
Advertisement