తోలుకట్ట(మొయినాబాద్), న్యూస్‌లైన్: అడవి పందుల బెడద నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు వేసిన విద్యుత్ కంచె ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. అయితే అర్ధరాత్రి సమయంలో విద్యార్థి పొలానికి ఎందుకు వెళ్లాడనేది అనుమానాస్పదంగా మారింది. సీఐ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన షేక్ హైమద్ రజా(21) మొయినాబాద్ మండల కేంద్రంలో ఓ గదిలో అద్దెకు ఉంటూ మండల పరిధిలోని ఎత్‌బార్‌పల్లి రెవెన్యూలో ఉన్న ఎస్‌వీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాల్గొవ సంవత్సరం చదువుతున్నాడు. రోజూ ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్లివచ్చేవాడు.
ఎత్‌బార్‌పల్లికి చెందిన పల్లె పద్మారెడ్డికి తోలుకట్ట రెవెన్యూ పరిధిలో 4 ఎకరాల పొలం ఉంది.
అందులో మొక్కజొన్న పంట వేశాడు. మొక్కజొన్న పంటను అడవిపందులు నాశనం చేయకుండా చేను చుట్టూ ఇనుపవైర్లు కట్టి విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. కాగా శుక్రవారం ఉదయం మొక్కజొన్న చేనులో పనిచేయడానికి వెళ్లిన ఓ వ్యక్తికి విద్యుదాఘాతంతో మృతి చెందిన షేక్ హైమద్ రజా కనిపించాడు. అతడు వెంటనే స్థానికులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రవిచంద్ర, ఎస్సై శంకరయ్య సిబ్బం దితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. విద్యార్థి షేక్ హైమద్ రజా చొక్కా విప్పి చేతిలో పట్టుకుని, కాళ్లకు విద్యుత్ వైర్లు తగలడంతో కాలిన గాయాలతో మృతి చెంది బోర్ల పడి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ముంబాయిలో ఉన్న మృతుడి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. గురువారం అర్థరాత్రి సమయంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రైతు పద్మారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
మృతిపై పలు అనుమానాలు
విద్యార్థి మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. గురువారం కళాశాలకు వెళ్లిన షేక్ హైమద్ రజా ఆ తర్వాత పొలం వైపు ఎందుకు వెళ్లాడనేది తెలియకుండా ఉంది. విద్యుత్ తీగలు తగిలి పడిన సమయంలో అతడి చొక్క ఒంటిపైన లేకుండా చేతిలో ఉండటం, మొక్కజొన్న చేళ్లో పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తుండడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మక్క బుట్టల కోసమైతే అర్ధరాత్రి సమయంలో వెళ్తాడా అనే అనుమానం కలుగుతుంది.
అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Published Sat, Sep 14 2013 1:01 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement