సినీ నటులు కేవలం రీలు హీరోలేనని.. వాస్తవ జీవితంలో ఇంజనీర్లు నిజమైన హీరోలని వర్థమాన సినీ నటుడు ఏ కృష్ణుడు అన్నారు.
పటాన్‌చెరు, న్యూస్‌లైన్:
సినీ నటులు కేవలం రీలు హీరోలేనని.. వాస్తవ జీవితంలో ఇంజనీర్లు నిజమైన హీరోలని వర్థమాన సినీ నటుడు ఏ కృష్ణుడు అన్నారు. ప్రసిద్ధ సివిల్ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా శనివారం గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలోని ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో ఇంజనీర్ల ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి వివరించారు. గీతం పూర్వ విద్యార్థి, విశాఖ జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్‌లో అదనపు జనరల్ మేనేజర్ వైవీ శాస్త్రి మానవ విలువలు, వృత్తి పట్ల నిబద్ధతల గురించి చెప్పారు. తన విద్యార్థి అనుభవాలను వివరించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉపాధి అవకాశాల గురించి విద్యార్థులకు తెలిపారు. మరో పూర్వ విద్యార్థి ‘మిరపకాయ్’ ఫేమ్, స్క్రీన్‌ప్లే డెరైక్టర్ ఏ దీపక్ రాజ్ కూడా తన అనుభవాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో గీతం హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ సంజయ్, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ ఆర్ వర్మ, వైస్ ప్రిన్సిపాల్ బీ బసవరాజ, ఈసీఈ విభాగాధిపతి కే మంజునాథ చారి, అసోసియేటెడ్ ప్రొఫెసర్ పీ త్రినాథ్ రావు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు, టెక్నాలజీ రంగ నిఫుణులు, సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
ఎల్లంకిలో...
ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పటేల్ గూడలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో శనివారం భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఘనంగా జరిగాయి. ఎల్లంకి గ్రూప్‌లోని అన్ని కళాశాలల విద్యార్థులు ‘లైఫ్ వితౌట్ ఇంజనీరింగ్’ అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం వీడియో కాస్ట్ కూడా ప్రదర్శించారు. కార్యక్రమంలో గ్రూప్ చైర్మన్ ఎల్లంకి సదాసదాశివరెడ్డి, టీ శ్రవణ్ కుమార్, ఈసీఈ డిపార్టుమెంట్ హెచ్‌ఏడీ ప్రిన్సిపాల్ అంజాన్ షేక్, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ నమ్రత మనోహర్, కే శ్రీధర్, కేఆర్‌ఎన్ ఠాగూర్ పవన్‌కుమార్, ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.