గరుగుబిల్లి మండలంల రావివలస పీఏసీఎస్‌లో బినామీ రుణ గ్రహీతల విచారణ ..
పార్వతీపురం/గరుగుబిల్లి: గరుగుబిల్లి మండలంల రావివలస పీఏసీఎస్‌లో బినామీ రుణ గ్రహీతల విచారణ నాలుగో రోజూ కొనసాగింది. శుక్రవారం జరిగిన విచారణకు 134 మందికి నోటీసులు జారీ చేయగా 76మంది హాజరయ్యారు. పీఏసీఎస్ కార్యాలయానికి విచారణకు వచ్చిన బాధితులు డీసీసీబీ అధ్యక్షురాలు మరిశర్ల తులసి, సర్పంచ్ బలరాం నాయుడు, సీఈఓ సింహాచలంలను అరెస్ట్‌చేయాలంటూ...నినాదాలు చేస్తూ..కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. బాధితులు కార్యాలయంలోనికి రాకుండా ఎస్సై డి.ఈశ్వర్రావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు.
ఈసందర్భంగా కార్యాలయం ఆవరణ లో ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అప్పు కావాలంటే కుంటి సాకులు చెప్పి...కాళ్లరిగేలా తిప్పించే పీఏసీఎస్‌లు...తాము కోరకుండా..తామెవరో తెలియకుండా..సభ్యత్వ నమోదు లేకుండానే.. తమ పేరున రూ.75వేలు రుణాలున్నట్లు...విచారణకు హాజరు కావాలంటూ...నోటీసులివ్వడం పట్ల బాధితుల ఆగ్రహోదగ్రులయ్యారు. ఈ సందర్భంగా చిలకాంకు చెందిన ద్వారపురెడ్డి సత్యనారాయణ, రావివలసకు చెందిన కోట సుమన్, కారివలసకు చెందిన పట్టా లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ బినామీ రుణాలు వాడేసి ఎవరి కొంప ముంచేస్తారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఎస్సై వారికి నచ్చచెబుతూ..విచారణ పూర్తి అయినవెంటనే ఏఎస్పీ ఇచ్చిన హామీ ప్రకారం దోషులు ఎంతటివారినైనా చట్టం శిక్షిస్తుందన్నారు. అనంతరం వారు రుణాల జాబితా కోరగా 4,514 మందికి సంబంధించిన రుణ జాబితాను అందజేశారు. దీంతో బాధితులు శాంతించారు. తర్వాత విచారణ కొనసాగింది.
అప్పు ఎలా తీర్చాలి
ఈ సందర్భంగా విచారణకు వచ్చిన వారిలో దత్తివలసకు చెందిన దత్తి కాం చన మాట్లాడుతూ కుంటిదాన్ని. నాకు లోనేటి బాబు. ఇప్పుడెలా తీర్చాలి ఆ లోనం టూ.. గుండెలవిసేలా రో దిస్తుంటే...చుట్టూ ఉన్నవారంతా ఆవేద న చెందారు.
బిక్షమెత్తే నాకు లోనా!
ఊరూరా...ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తుకుని పూటగడుపుతున్న తనకు లోనేంటని విచారణకు హాజరైన వారిలో చిలకాం గ్రామానికి చెందిన మారెడ్డి పార్వతి అనే యాచకురాలు వాపోయింది. ఆమె ఆవేదన అక్కడున్నవారందర్నీ కలచివేసింది.