బుచ్చెయ్యపేట మండలంలోని కొండపాలెం ప్రశాంతతకు నిలయం. ఈ గ్రామస్తులు గొడవలు పడి ఇంతవరకూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన సందర్భం లేదు. స్థానిక ఎన్నికల్లో పోటీ పడిన పాపానపోలేదు. ఊరందరిదీ ఒకేమాట. ఒకేబాట. ఇప్పుడా గ్రామాన్ని కిడ్నీవ్యాధి మహమ్మారి పీడిస్తోంది.
వయస్సుతో సంబంధం లేకుండా 20 నుంచి 80 ఏళ్ల వరకూ అందరూ ఈ వ్యాధి బాధితులే. ఏడాది కాలంలో దీని బారిన పడి ఆరుగురు చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇంకా పదిమంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సుమారు 600 జనాభా ఉన్న ఈ గ్రామంలో రక్షిత తాగునీటి పథకం లేదు. అందరికీ గ్రామంలోని గొట్టపుబావే ఆధారం. బోరునీరే వ్యాధికి కారణమని
గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన చిన్ని రాజబాబు (38), మత్సకర్ల కన్నారావు (42), మంత్రి చిన్న (37), మత్సకర్ల సన్నిబాబు (48), జామి రాములమ్మ (49), మత్సకర్ల అప్పలనాయుడు (50)లు ఈ వ్యాధితో చనిపోయారు. తాటికొండ అప్పారావు (50), మత్సకర్ల రాజారావు (52), శ్రీరాములు (54), కోరిబిల్లి అర్జునమ్మ (36)ల పరిస్థితి విషమంగా ఉం ది. వీరికి నయం కాదని తేల్చేశాక విశాఖ కేజీహెచ్ నుంచి ఇటీవల డిశ్చార్జి చేసి పంపించేశారు.
ఈ గ్రామానికి చెందిన మాజీ మండలాధ్యక్షుడు ఎం.వి.వి.సత్యనారాయణతో పాటు మత్సకర్ల అప్పారావు, పెద్దాడ శ్రీను, బొడ్డేడ భూలోక, గుమ్మిడి సింహాద్రి, సిహెచ్.రామునాయుడు, తదితరులు ఇదే వ్యాధికి గురయ్యారు. రోజు రోజుకు పరిస్థితి అదుపుతప్పుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఈ గ్రామంలోని నీరు తాగడానికి పనికి రాదని అధికారులు గుర్తించినా, ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని ప్రాణాలను కాపాడాలని మాజీ ఎంపీపీ ఎం.వి.వి.సత్యనారాయణ, సర్పంచ్ ఎం.భవాని, నాయకులు తాతయ్యలు, నాగేశ్వరరావు కోరుతున్నారు.