‘చేయూత’తో పేదరికానికి చెక్‌ | CM YS Jagan personally wrote letters to 25 lakh YSR Cheyutha beneficiaries | Sakshi
Sakshi News home page

‘చేయూత’తో పేదరికానికి చెక్‌

Published Wed, Aug 12 2020 3:55 AM | Last Updated on Wed, Aug 12 2020 10:29 AM

CM YS Jagan personally wrote letters to 25 lakh YSR Cheyutha beneficiaries - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు అందజేసే డబ్బును పెట్టుబడిగా ఉపయోగించుకుంటే పేదరికానికి శాశ్వత పరిష్కారం కనిపిస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన 25 లక్షల మంది వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయానికి ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. లబ్ధిదారులందరి బ్యాంకు ఖాతాల్లోకి సీఎం జగన్‌ ఈ మొత్తాన్ని జమచేస్తారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు, మండల, గ్రామస్థాయిలో లబ్ధిదారులతో కలిసి స్థానిక నేతలు ఈ పథకం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సెర్ప్, మెప్మాలు ఏర్పాట్లుచేశాయి. అలాగే, సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమాన్నీ ఆయాచోట్ల వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు సెర్ప్‌ సీఈఓ రాజాబాబు తెలిపారు.

లబ్ధిదారులకు సీఎం లేఖ..
అక్కచెల్లెమ్మలందరికీ హృదయ పూర్వకంగా అభినందనలతో..
► ఆగస్టు 12, 2020 నుంచి ‘చేయూత’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాల్లోని 45–60 ఏళ్ల మధ్య ఉన్న పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 

► నా పాదయాత్ర సమయంలో అక్కచెల్లెమ్మలు చెప్పిన ప్రతిమాటా గుర్తుంది. వయస్సు మీద పడుతున్నా, రోజంతా కష్టపడినా వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోవడంలేదని, జీవితాలు మారటంలేదన్న మీ ఆవేదనను అర్ధంచేసుకుని చేయూత పథకాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చాం.

► ఏటా రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల సహాయం చేస్తామన్న మాటను నిలబెట్టుకుంటున్నా. అక్కచెల్లెమ్మలు ఈ డబ్బును సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు.. దేశంలోనే అతిపెద్ద కంపెనీలు, బ్యాంకుల ద్వారా సహాయాన్ని, సహకారాన్ని అందించేందుకు ఒప్పందాలు చేసుకున్నాం.

► మీకు అందే రూ.18,750లను ఎలా ఉపయోగించుకుంటారన్న అంశంపై ఎలాంటి షరతుల్లేవు. అయితే.. ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకుని వస్తువులు కొని.. అమ్మి మరికొంత లాభం సంపాదించేందుకు వీలుగా పాల ఉత్పత్తుల దిగ్గజం అయిన అమూల్, ప్రజలంతా నిత్యం కొనుగోలు చేసే ప్రముఖ కంపెనీలు ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, రిలయెన్స్‌ ఉత్పత్తుల్ని హోల్‌సేల్‌ ధరల కంటే తక్కువకే మీకు ఇప్పించేలా వారితో ఒప్పందాలు చేసుకున్నాం. మున్ముందు మరెన్నో కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాం. ఈ ఉత్పత్తుల్ని తక్కువ రేటుకు కొని మార్కెట్‌ చేస్తే, మన ప్రభుత్వం ఇచ్చే సాయంతో మీరు మరో మెట్టు ఎదగగలుగుతారన్న భావంతోనే ఈ పథకాన్ని మరింత విస్తృతం చేశాం. ఇది ఒక ప్రత్యామ్నాయమైతే.. మీకు మీరుగా మీ నిర్ణయం ప్రకారం సృష్టించుకునే వ్యాపారావకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. కోళ్లు, పాడిపశువుల పెంపకం, గొర్రెలు–మేకల పెంపకం, కిరాణా వ్యాపారం, చేనేత, వస్త్ర వ్యాపారం, తదితర లాభసాటి ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వమిచ్చే డబ్బును పెట్టుబడిగా ఉపయోగించుకుంటే పేదరికానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నాం. 

► ఒకవేళ అమూల్, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, రిలయెన్స్‌ కంపెనీలతో మీరు వ్యాపార భాగస్వామ్యం కావాలంటే ఈ ఉత్తరంతో మీకు అందిస్తున్న ఎంపిక పత్రాన్ని పూర్తిచేసి గ్రామ–వార్డు వలంటీర్‌కు అందించినట్లయితే సెర్ప్‌ లేదా మెప్మాల ద్వారా బ్యాంకులు, ఆయా కంపెనీలతో అనుసంధానం చేస్తారు. మీరు వ్యాపారం చేయడానికి వారు సహకరిస్తారు. అక్కచెల్లెమ్మల జీవితాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి అన్ని విధాలుగా కృషిచేస్తున్న మహిళా పక్షపాత ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మీ అండదండలు ఉండాలని.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దేవుడి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని నిండు మనస్సుతో కొరుకుంటున్నాను.

ఇట్లు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement