- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కసిపెద్ద నర్సింహరాజు
- బహిష్కరించేందుకు కృషి చేయాలి
- {పతినబూనిన సర్పంచ్‌లకు సన్మానం
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : మద్యానికి బానిసలై యువత అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారని స్వచ్ఛంద మద్యం బహిష్కరణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కసిపెద్ద నర్సింహరాజు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో మద్యం బహిష్కరిస్తామని ప్రతినబూని, ఉద్యమానికి సహకరిస్తామని హామీ ఇచ్చిన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత కళాశాల వయస్సులోనే బానిసలవుతున్నారన్న విషయాలను పరిగణలోకి తీసుకొని బహిష్కరణ ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
1980లో 25 ఏళ్లకు పైబడిన వారు మద్యానికి అలవాటు పడగా.. అది 2012 నాటికి 13 ఏళ్లకు చేరిందన్నారు. దీనిని అరికట్టడానికి మద్య నిషేధం కాకుండా స్వచ్ఛందంగా మద్యం తాగడాన్ని బహిష్కరించి వారిలో మార్పు తీసుకురావాలనే ఆశయంతో 2010లో ఈ వేదికను రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి ఫిబ్రవరి 28న మద్యాన్ని బహిష్కరించే విద్యార్థులు, యువకులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 40వేల మందితో ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. మద్యం తయారీ, అమ్మకాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో టాస్క్‌ఫోర్స్, టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేయాలన్నారు.
గంగదేవిపల్లి ఉప సర్పంచ్ కూసం రాజమౌళి మాట్లాడుతూ గ్రామంలో సుమారు 30 ఏళ్లుగా మద్యం నిషేధం అమలు చేస్తున్నామన్నారు. సామాజిక కార్యకర్త వెంకటరమణ మాట్లాడుతూ గంగదేవిపల్లిలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్న రాజమౌళి మరికొన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని కోరారు. అనంతరం మద్యం బహిష్కరణ ఉద్యమానికి సహకారం అందిస్తున్న 47 మంది సర్పంచ్‌లను సన్మానించారు. గత ఏడాది ప్రతిజ్ఞలు చేసిన వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కైలాసం, రామ్మూర్తితోపాటు సర్పంచ్‌లు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.