నూజివీడు, న్యూస్‌లైన్ : ‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన’ చందంగా ఉద్యోగం చేస్తున్న చోటే లక్షలాది రూపాయల విలువ చేసే సొత్తును దొంగిలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నూజివీడు సీఐ సిహెచ్.వి.మురళీకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ఇండస్ టవర్స్ అనే సంస్థ ప్రైవేటు సెల్‌ఫోన్ కంపెనీలకు టవర్స్‌ను అద్దెకిస్తుంది.
ఈ సంస్థకు నూజివీడులో సాంకేతిక నిపుణుడిగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన విత్తనాల నాగ సూర్యచంద్రరావు, సూపర్‌వైజర్‌గా తిరువూరు శాంతి నగర్‌కు చెందిన దాసరి రాజేష్ పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలసి సెల్‌టవర్స్ వద్ద ఉండే కంట్రోల్ రూమ్‌లలోని స్టెబిలైజర్లు, కన్వర్టర్లు, జనరేటర్ ఇన్వర్టర్లు, బ్యాటరీలు, విలువైన వైర్లను దొంగిలించి బయట అమ్ముకుంటున్నారు.
ఈ వ్యవహారం దాదాపు ఏడాది కాలంగా సాగుతోంది. కంట్రో ల్ రూమ్‌లలో సామగ్రి తరచూ అపహరణకు గుర వుతుండటంతో ఈ టవర్లకు రక్షణ బాధ్యత నిర్వహించే ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ అధికారి మత్తె శ్రీనివాసరావు గతనెల 27న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. నాగసూర్యచంద్రరావు పట్టణంలోని పోతురెడ్డిపల్లి రోడ్డులో అద్దెకు ఉంటున్న ఇంటిపై దాడి చేశారు.
అపహరణకు గురైన దాదాపు రూ.7 లక్షల విలువైన సామగ్రిని ఆ ఇంటిలో స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి నాగసూర్యచంద్రరావును, అతడికి సహకరిస్తున్న రాజేష్‌ను శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషిచేసిన ఎస్సై ఐవీ నాగేంద్రకుమార్, కానిస్టేబుల్ నాగరాజు తదితర సిబ్బందిని ఆయన అభినందించారు.
ఇంటి దొంగల గుట్టు రట్టు
Published Sat, Oct 5 2013 1:56 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
Advertisement
Advertisement