సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : కార్మికుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, వారి జీతంలో నుంచి కేటాయించిన మొత్తంతో నడుస్తున్న ప్రభుత్వ కార్మిక బీమా వైద్యశాలలు (ఈఎస్‌ఐ ఆస్పత్రి) సమస్యలకు నిలయంగా మారాయి. వైద్యాధికారుల నియామకంపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడంతో కార్మికులకు వైద్యసేవలు గగనమవుతున్నాయి. ఈ క్రమంలో వారికి ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవతున్నాయి. సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట ప్రాంతంలోని పారిశ్రామిక సెజ్‌ల్లో
ఇటీవల కాలంలో 50 పరిశ్రమల వరకు ఏర్పాటయ్యాయి. వీటిలో సుమారు 25 వేల మంది వరకు పనిచేస్తుండగా, 13 వేల మందికి ఈఎస్‌ఐ కార్డులున్నాయి. కార్మికులతో పాటు వారి కుటుంబసభ్యులకు కలిపి సుమారు 92 వేల మందికి ఈఎస్‌ఐ వర్తిస్తుంది. వీరందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో సూళ్లూరుపేటలోని షార్ బస్టాండ్ సమీపంలో డిస్పెన్సరీ, సూళ్లూరుపేట-శ్రీహరికోటరోడ్డులో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశారు. కార్మికుల కష్టంతో నిర్వహిస్తున్న ఈ ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందించలేకపోతున్నారు. డిస్పెన్సరీలో నలుగురు వైద్యులకు గాను కొద్దిరోజులు ముగ్గురే పనిచేశారు. ప్రస్తుతం కేవలం ఒకే డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ కూడా నెల్లూరు నుంచి డిప్యూటేషన్‌పై వచ్చివెళుతున్నారు. రోజుకు సుమారు రెండు వందల మందికి పైగా వైద్యసేవలు పొందేందుకు వస్తుండటంతో ఒక డాక్టర్ వైద్యసేవలు అందించలేకపోతున్నారు. రెండుపూట్ల నిర్వహించాల్సిన ఆస్పత్రిని మధ్యాహ్నం వరకే పరిమితం చేయడంతో పాటు ఆదివారం, ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లో పూర్తిగా మూసేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులు, వారి కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురైతే ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి.
డయాగ్నోస్టిక్ సెంటర్‌లో మరీ దారుణం
సూళ్లూరుపేటలోని ఈఎస్‌ఐ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో 13 మంది స్పెషలిస్టు డాక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సివిల్ సర్జన్లు వైద్యసేవలందించారు. గత నెలాఖరుదాకా 9 మంది డాక్టర్లు ఉండేవారు. వారిలో ఇద్దరు నవంబర్‌లో ఉద్యోగ విరమణ చేశారు. మిగిలిన ఏడుగురిలో నలుగురు డిప్యూటేషన్‌పై వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఒకరు మెటర్నటీ సెలవులో ఉన్నారు. విజయవాడ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి విధులు నిర్వర్తిస్తున్న ఓ డాక్టర్ నెలలో రెండు,మూడు సార్లు మాత్రమే వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఉన్న ఒకరిద్దరు డాక్టర్లు అందిస్తున్న సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ ఆస్పత్రి నిర్వహణకు ఇన్‌చార్జిగా నియమించిన రామకృష్ణారెడ్డి తిరుపతి నుంచి ఎప్పడు వస్తారో, రారో తెలియని పరిస్థితి నెలకొంది. తగినంత పని, పర్యవేక్షించే వారు లేకపోవడంతో ఉన్న 40 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మధ్యాహ్నానికే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. రోగులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన మందులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన వైద్యసేవలందించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
ఆస్పత్రి విషయమే తెలియదు బి.బుజ్జమ్మ, కార్మికురాలు, సూళ్లూరు
ఇక్కడ ఈఎస్‌ఐ ఆస్పత్రి ఉందనే విషయమే మాకు తెలియదు. ఈఎస్‌ఐ కార్డు మాత్రం ఉంది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రైవేటు ఆస్పత్రికే వెళుతుంటాం.
ఎప్పుడు వెళ్లినా డాక్టర్లుండరు మనోజ్, కార్మికుడు, దొరవారిసత్రం
ఈఎస్‌ఐ డిస్పెన్సరీకి ఎప్పుడు వెళ్లినా డాక్టర్లుండరు. మధ్యాహ్నం పైన వెళితే తాళం వేసివుంటారు. డయగ్నోస్టిక్ సెంటర్‌లోనూ అదే పరిస్థితి. సెకండ్ షిప్ట్ డ్యూటీ చేసుకుని ఆస్పత్రికి వెళితే వెనక్కు రావాల్సిందే.
వామ్మో..ఈఎస్‌ఐ ఆస్పత్రులా !
Published Thu, Jan 16 2014 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement
Advertisement