యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా | esuka dandha maintain to every places | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

Published Fri, Feb 14 2014 2:19 AM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా - Sakshi

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా


 తాడేపల్లి రూరల్,
 మహానాడు ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. అక్రమదారులు అధికారుల కళ్లుగప్పేందుకు కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. బస్తాల్లో ఇసుక తరలిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కృష్ణానదిలోకి వెళ్లి ఇసుకను బస్తాల్లో నింపి వాటిని ఒడ్డుకు తీసుకుని వచ్చి, కావాలసిన వారికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క ఇసుక బస్తాను రూ. 50 అమ్ముకుంటూ జల్సాగా కాలం గడుపుతున్నారు. ఈ విధంగా ఇసుకను బస్తాల రూపంలో రవాణా చేసే ముఠాలు 20కి పైగానే ఉన్నట్టు వినికిడి. వీరి ఆదాయం రోజుకు లక్ష రూపాయలకు పైగానే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో ఆటో డ్రైవర్లుగా పనిచేసినా, అద్దె ఆటో ఖర్చు, ఇతర ఖర్చులు పోను ఇంటికి మిగిలేది వందో, రెండొందలే కావడంతో దాని కంటే ఇసుక అమ్ముకోవడం నయమని భావించి, చేస్తున్న పనులు సైతం మాని, అక్రమ ఇసుక బస్తాల రవాణా ద్వారా అక్రమార్జనకు అలవాటు పడ్డారు. ఈ ప్రాంతంలో మసీదు దగ్గర నుండి కృష్ణనది చివరి వరకు వెళ్లి చూసినా రోడ్డు పక్కల ప్రతి ఇంటి ముందు గుట్టలు గుట్టలుగా పేర్చిన ఇసుక బస్తాలు దర్శనమిస్తూ ఉంటాయి. వీటిని కావలసిన వారికి కావలసిన చోటుకు టాటా ఏస్‌ల ద్వారా, ఈ ముఠా సభ్యులే సప్లయి చేస్తూ దర్జాగా కాలం గడుపుతున్నారు.
 చోద్యం చూస్తున్న పోలీసులు
 ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం అక్రమ ఇసుక రవాణాకు అడ్డు కట్ట వేయలేకపోయారనే విమర్శలు పట్టణంలో సర్వత్రా వినిపిస్తున్నాయి. అక్రమమార్కుల భరతం పడతాం... అవినీతిని చీల్చి చెండాడతాం...అవసరమైతే సస్పెక్ట్ షీట్లు తెరుస్తామంటూ పోలీసు ఉన్నతాధికారులు పత్రికా ప్రకటనలు ఇవ్వడం తప్ప అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోలేకపోతున్నారని పోలీసుల పనితీరును పురప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణా సరిహద్దులు దాటుతూ తమ కళ్లెదుటే ప్రజా సంపదైన ప్రకృతి సంపద తరలి వెళుతున్నా, ప్రకాశం బ్యారేజి వద్ద నున్న అవుట్ పోస్టు పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప అక్రమ ఇసుక రవాణాను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement