హతుడెవరో.. హంతకులెవరో! | Etcherla police murder case | Sakshi
Sakshi News home page

హతుడెవరో.. హంతకులెవరో!

Published Sat, Dec 20 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

హతుడెవరో.. హంతకులెవరో!

హతుడెవరో.. హంతకులెవరో!

ఓ వ్యక్తిని హత్యచేసి తగులబెట్టేసిన కేసుకు సంబంధించి హతుడెవరో ఇంతవరకూ తెలియకపోవడంతో హంతకులెవరో కూడా తెలిసే అవకాశం కనిపించడంలేదు. ఎచ్చెర్ల పోలీసులకు సవాల్‌గా మారిన ఈ కేసు మిస్టరీ వీడాలంటే ముందుగా హతుడి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు జిల్లా దాటి దర్యాప్తు ముమ్మరం చేసినా ఫలితం శూన్యం.
 
పోలీసులకు సవాల్‌గా హత్యకేసు
మృతదేహాన్ని తగులబెట్టడంతో ఆచూకీ తెలియని వైనం
ముమ్మరంగా అన్వేషిస్తున్న బృందాలు

ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ చినరావుపల్లి ఫైరింగ్ రేంజ్ సమీంలోని జీడిమామిడితోటలో గత నెల 26న, హత్యచేసిన ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు గోనె సంచితో తెచ్చి పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. మృతదేహం తల మాత్రం సగమే కాలడంతో పోలీసులు కొంత ఆనవాలు పట్టి, ఆ మరుసటి రోజు రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని చూసిన పోలీసులు హత్యజరిగిన తీరును అంచనావేసి ఐపీఐ 302, 201 సెక్షన్ల కింద (హత్యానేరం కేసు తారుమారుయత్నం) కేసు నమోదు చేశారు.

శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవనాయుడు, జేఆర్ పురం సీఐ కె.అశోక్‌కుమార్ స్పందించి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పోలీసులను అప్రమత్తం చేశారు. విజనగరం, విశాఖ జిల్లాలతోపాటు ఒడిశాలోని బరంపురం, పర్లాకిమిడి, గజపతి వంటి ప్రాంతాల్లో సైతం దర్యాప్తు బృందాలు అన్వేషించాయి. రైల్వే స్టేషన్లలో సైతం మృతుని నమూనా చిత్రాన్ని అతికించారు. దర్యాప్తు ప్రారంభించి రెండు వారాలు గడుస్తున్నా ఆచూకీ మాత్రం చిక్కడంలేదు.
 
ముందుగా మృతుని ఆచూకీ లభ్యమైతే తప్పనిసరిగా నిందితులను పట్టుకోగలమని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అన్ని నెట్‌వర్క్‌ల నుంచి సెల్ ఫోన్ సంభాషణలు జరిపిన కాల్ లిస్టులు సైతం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమవ్వడం విశేషం. ఏ చిన్న క్లూ అయినా దొరక్కపోదా అన్న ఆశతో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిందితులు తెలివిగా వ్యవహరించడం పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

హత్య అనంతరం ఆచూకీ తెలిసే అవకాశం లేకుండా మృతదేహాన్ని తగులబెట్టడం ఒక ఎత్తయితే.. సుదూర ప్రాంతం నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ తగులబెట్టేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే మృతదేహాన్ని తగులబెట్టడానికి ఈ ప్రదేశాన్నే ఎంచుకున్నారంటే ఇది ఈ ప్రాంతవాసుల హస్తమేదైనా ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు బృందాలు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని దర్యాప్తు అధికారి, జె.ఆర్.పురం సీఐ అశోక్ కుమార్ చెప్పుకొస్తున్నారు. మృతుని వివరాలు తెలిస్తే నిందితుల వివరాలు తెలిసే అవకాశముంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement