సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అవసాన దశలో ఉన్న వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు వారి పొట్టగొడుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అవసాన దశలో ఉన్న వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు వారి పొట్టగొడుతున్నాయి. రకరకాల నిబంధనల పేరుతో అర్హులను సైతం తొలగిస్తూ వారికి కడుపుకోత మిగుల్చు తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులకు ఇస్తున్న సామాజిక భద్రతా పించన్లను రూ.70 నుంచి రూ.200, రూ.500కు పెంచి వారికి భరోసా ఇచ్చారు.
అదే విధంగా మరికొందరు లబ్ధిదారులను గుర్తించి వారికీ అప్పటి ప్రభుత్వం అండగా నిలిచింది. అయితే వైఎస్సార్ మరణం తరువాత ఏర్పడిన ప్రభుత్వాలు వారికిచ్చే భృతికి కోతేయడంపై కన్నేశాయి. ఆధార్, రేషన్‌కార్డు లేనివారిని, నివాసం, కొద్దోగొప్పో భూమి ఉన్న వారిని తొలగించటమే పనిగా పెట్టుకుంది. అందులో భాగంగా కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం తొలగించిన పింఛన్ లబ్ధిదారుల్లో సుమారు 90 శాతం మంది అర్హులేనని అధికారులే ఒప్పుకుంటున్నారు.
అయితే టీడీపీ అధినేత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని చెప్పుకునేందుకు కొందరు లబ్ధిదారులను తొలగించి.. వారికిచ్చే మొత్తాన్ని మిగిలిన వారికి పంచిపెట్టి తామూ హామీలను నిలబెట్టుకుంటున్నామని చెప్పుకునేందుకు ఎత్తు వేసింది. అందులో భాగంగానే ఇటీవల టీడీపీ ప్రభుత్వం తమ్ముళ్లను కమిటీలుగా ఏర్పాటు చేసి మరీ తొలగించారు. అందులో టీడీపీకి ఓటేయని వారిని గుర్తించి మరీ తొలగించటమే కార్యక్రమంగా పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా టీడీపీ ప్రభుత్వ వ్యవహరిస్తోందని పలువురు మండిపడుతున్నారు. అర్థాంతరంగా పించన్లు తొలగిస్తే మేమెట్టా బతకాలి? అని పలువురు లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
ఇష్టారాజ్యంగా తొలగింపు
ఇటీవల జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు కమిటీల పేరుతో అనేక మంది లబ్ధిదారులను అర్హుల జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 2.58,382 పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి గతంలో ప్రభుత్వం రూ.6.73 కోట్లు చెల్లించేది. టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు గతంలో ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ. వెయ్యి నుంచి రూ.1,500కు పెంచుతానని ప్రకటించారు. ఈ లెక్కన ఉన్న వారందరికీ ఇవ్వాలంటే భారమవుతుందని భావించిన చంద్రబాబు అధికారులపై నమ్మకం లేక తమ్ముళ్లతో కమిటీలు వేసి పింఛన్ల ఏరివేతకు శ్రీకారం చుట్టారు.
అలా కొద్దిరోజుల క్రితం టీడీపీ నేతలు కమిటీలుగా ఏర్పడి సుమారు 50వేల మందిని తొలగించారు. మరో 5వేల మంది పింఛన్లకు అర్హులా? కాదా? అనేది ఇంకా తేల్చలేదు. ఇదిలా ఉంటే కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న 30వేల మంది పరిస్థితేంటనే విషయం తేల్చలేదు. దీంతో టీడీపీ ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి చేపట్టిన జన్మభూమి-కార్యక్రమాన్ని లబ్ధిదారులు అడుగడుగునా అడ్డుకున్నారు. నాయకులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పింఛన్ తొలగించారనే బెంగతో వృద్ధుడి మృతి
అనుమసముద్రంపేట: టీడీపీ నాయకులు తన పింఛన్‌ను తొలగించారనే బెంగతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గుడిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, మృతుడి బంధువుల కథనం మేరకు..పల్లాపు లక్ష్మయ్య (70)కు పదేళ్లుగా వృద్ధాప్య పింఛన్ వస్తోంది. గ్రామంలో లక్ష్మయ్య లేడనే కారణంతో ఇటీవల పింఛన్‌ను తొలగించినట్టు గ్రామసభలో తెలిపారు.
లక్ష్మయ్య కుమార్తె, కుమారుడు జలదంకిలో ఉన్నారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆయన కుమారుడి వద్దకు వెళ్లాడు. పింఛన్ల కమిటీ సమావేశం రోజు రాలేదన్న కారణంతో పింఛన్‌ను తొలగించారు. గుడిపాడు గ్రామంలో జరిగిన జన్మభూమి-మాఊరు గ్రామసభలో లక్ష్మయ్యకు పింఛన్ ఇవ్వలేదు. దీంతో కలత చెంది తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు వైద్యశాలకు తరలించేలోపు మృతి చెందాడు. అధికార పార్టీ నేతలు అర్హులైన వృద్ధుల పింఛన్ల తొలగించి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని పలువురు మండల నాయకులు ఆరోపిస్తున్నారు.