రెండేళ్లు దాటకపోయినా బదిలీ వేటు
ఉద్యోగుల బదిలీల నిబంధనల్లో సవరణలు
అస్మదీయులకోసం
మారనున్న జీవో
కాసుల కోసమే రెండేళ్లు దాటని వారిపైన బదిలీ వేటు
సీఎం పేషీకి చేరిన ఫైలు
హైదరాబాద్: ఇప్పటికే ఉద్యోగుల బదిలీలను రాజకీయ బదిలీలుగా వ్యవస్థీకృతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒకచోట పనిచేస్తూ రెండేళ్లు పూర్తి కాకపోయినప్పటికీ బదిలీ చేసేయాలని నిర్ణయించింది. బదిలీలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేయడంపైనే ఉన్నతాధికార వర్గాల్లో విమర్శలు వచ్చాయి. అయినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి పేరుతో రెండేళ్లు దాటకపోయినప్పటికీ బదిలీ వేటు వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం పంపించింది. బదిలీలపై తొలుత ఇచ్చిన జీవోలో ఒక చోట పనిచేస్తూ రెండేళ్లు దాటని ఉద్యోగులెవరినీ బదిలీ చేయరాదని, ఐదేళ్లు దాటిన ఉద్యోగులందరినీ బదిలీలు చేయాలని పేర్కొంది. అయితే ఈ నిబంధనలు రాజకీయంగాను, కాసుల పరంగాను ప్రభుత్వానికి అడ్డువస్తున్నాయి. ఫలానా చోటకు బదిలీ కావాలని కోరుకున్న అస్మదీయులకు అక్కడ పోస్టింగ్ ఇచ్చేందుకు మంత్రులకు వీలు కుదరడం లేదు.
దీంతో ఒక చోట రెండేళ్లు దాటని ఉద్యోగులను బదిలీ చేయరాదనే జీవోలో సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది నవంబర్ నెల వరకు కూడా ఉద్యోగుల బదిలీలను ప్రభుత్వం చేసిన విషయం తెలిసిందే. ఆ బదిలీల సమయంలోనే డబ్బులు తీసుకుని బదిలీలు చేశారని వార్తలు రావడంతోపాటు ఒక ఉద్యోగి విషయంలో విశాఖపట్టణం మంత్రుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడమే కాకుండా ముఖ్యమంత్రి పేషీతోపాటు ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ జోక్యం కూడా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేండేళ్లు దాటని ఉద్యోగులను బదిలీలు చేయాలని తీసుకోనున్న నిర్ణయం వల్ల ఆ ఉద్యోగులు పిల్లల చదువుల విషయంలో ఎంత కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే కనీసం ఆలోచించకపోవడం శోచనీయమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
మరోవైపు ఐదేళ్లు దాటిన ప్రతీ ఉద్యోగిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఒక కేడర్‌లోని ఉద్యోగులందరూ ఐదేళ్లు దాటితే అందరినీ బదిలీ చేయాల్సి వస్తుంది. దీంతో ఆ కేడర్‌లో ఉద్యోగులందరూ కొత్త వారవుతారు. దీంతో పాలన కంటిన్యుటీ దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో ఐదేళ్లు దాటినప్పటికీ ఆయా కేడర్లలో బదిలీలు 20 శాతానికి మించరాదనే నిబంధనను తాజాగా విధించనున్నారు. ఈ సవరణ ఉత్తర్వులు నేడో రేపో రానున్నాయి.