అతి అనర్థమే...
వీడియోగేమ్స్‌కు అతుక్కుపోతున్న చిన్నారులు
కంటి జబ్బులు వచ్చే అవకాశం
చదువుపైనా తీవ్ర ప్రభావం
సాగర్‌నగర్ : అతి అనర్దదాయకమే అని పెద్దలు ఊరకే అనలేదు. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్, వీడియో, కంప్యూటర్ గేమ్స్‌పై పిల్లలు చూపుతున్న ఆసక్తి అంతా ఇంతా కాదు. ఫలితంగా చిన్న వయస్సులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. చిన్నారులు మారాం చేస్తే స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్, కిడ్స్ బొమ్మలు ఆన్ జేసి వారికెదురుగా పెడుతున్నారు. దీంతో వాటికి అలవాటుపడుతున్నారు. రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో పనులు సులువుగా చక్కబెట్టుకుంటున్నాం. అయితే ఈ ఆధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని అదుపులో పెట్టుకోవడం కూడా అంతే అవసరం. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగా లేకుంటే అనర్ధాలు కొని తెచ్చుకున్నట్టవుతుంది. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లలు ఆటలపై ఆసక్తి చూపుతారు. గతంలో క్రికెట్, వాలీబాల్, వంటి క్రీడల ద్వారా శారీరక శ్రమతో ఆరోగ్యానికి మేలు జరిగేది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్‌సెఫోన్లు, టీవీలు, కంప్యూటర్ తప్పనిసరి అవసరంగా మారడం, పిల్లలను బయటకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడకపోవడం తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పిల్లలు ఆటపాటలకు పక్కన పెట్టి వీడియో, కంప్యూటర్ గేమ్స్‌ను అతుక్కుపోతున్నారు.
తల్లిదండ్రుల గారాబం
కంప్యూటర్ల ముందు పిల్లలు గంటల సేపు గడపడాన్ని చాలా గొప్ప విషయంగా తల్లిదండ్రులు బావిస్తున్నారు. అందుకే వారు కూర్చున్న చోటకే అన్నం, పాలు వంటి ఆహార పదార్థాలను అందిస్తూ మురిసిపోతున్నారు. అలాగే ఏడ్చే పిల్లోడికి స్మార్ట్‌పోన్‌లో గేమ్స్ నొక్కితుంటే తల్లిదండ్రులు సంబర పడుతున్నారు. కానీ దీని వల్ల దీర్ఘకాలంలో అనార్దలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మిగితా శరీర అవయవాల మీద శ్రమ తగ్గడం వల్ల ఆ మేరకు కళ్ల మీద అధిక ప్రభావం పడుతుంది. దీంతో 15 ఏళ్ల వయస్సులోనే చిన్నారులు లేనిపోని ఆనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
చదువులోనూ వెనకడుగే
గేమ్స్ ఆడే క్రమంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గేమ్స్‌లో ఒక్కో స్టేజ్ దాటుకుంటూ ముందుకు పోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో శరీరంలో అడ్రినల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుందని, అధిక మోతాదుల్లో అడ్రినల్ శరీరంలో విడుదల కావడం మంచిది కాదని కేజీహెచ్ వైద్యనిపుణుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీనికి తోడు టీవీలు కంప్యూటర్లలో ఆడే వీడియో గేమ్స్‌పై ఆసక్తి ఎక్కువైతే తరగతి గదుల్లో చెప్పే పాఠాలు బోర్ కొడతాయి. పాఠాల్లో ఉండే విషయాలు కంటే గేమ్స్‌లో ఉండే అడ్వెంచర్స్ వారిని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి వారు రానురాను చదువులో వెనకబడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లలు పరిమిత సమయం కన్నా ఎక్కువ సేపు వీడియో గేమ్స్ వైపు ఆకర్షితులవుతున్నారా లేదా అన్న విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అదే విధంగా నెట్ సర్ఫింగ్‌లో ఎక్కువ సమయం గడిపే అలవాటును మాన్పిస్తే మంచిదని సూచిస్తున్నారు.
కళ్లపై అధిక భారం :
సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు.. అయితే పిల్లలు రోజులో ఎక్కువ సేపు టీవీలు, కంప్యూటర్ మానిటర్లకు అతుకుపోవడం వల్ల కళ్లపై అధిక భారం పడుతుంది. దాంతో కంటి సంబంధిత జబ్బులు, తలనొప్పి వంటి రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితులో మార్పు తీసుకురాకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఇటు ఉపాధ్యాయులు, అటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న వయస్సులోచూపుపై ప్రభావం పడితే విమానయాన, సైనికరంగాల్లో ఉపాధి అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉంది.
సైట్ వచ్చే అవకాశం ఎక్కువ
అతిగా టీవీ చూడడం, గేమ్స్ ఆడడం వల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా కళ్లకు సంబంధించి సమస్య ఎక్కువగా కనబడుతుంది. చిన్న వయస్సులోనే కళ్లద్దాలు వినియోగించాల్సిన వస్తోంది. ఎవరైనా సరే కాస్తై శరీరక శ్రమ చేయాలి. పిల్లలు ఈ పనిని ఆటల ద్వారా చేస్తారు. శరీరక శ్రమకు దూరమైన పిల్లల్లో క్రమంగా రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. పిల్లల ఎదుగదలపై ప్రభావం చూపుతుంది.
- శ్రీకుమార్, కంటి వైద్య నిపుణుడు
ఆసక్తి తగ్గించాలి
పిల్లలు టీవీని చూసి ఆనందిస్తారు. అయితే అతిగా చూడడం వల్ల అనర్ధాలు వస్తాయని పిల్లలు బలవంతంగా టీవీకి దూరంగా చేయకూడదు. అలా చేస్తే తల్లిదండ్రుల పట్ల వారు శత్రుత్వం పెంచుకుంటారు. వారి మనస్సు మారే విధంగా ఎక్చర్‌సైజులు చేయించాలి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల అభిరుచిని బట్టి సంగీతం, క్రీడలు, ఆర్ట్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించాలి.
- డాక్టర్ రమణమూర్తి, సైకాలజిస్ట్