అంతా రెడీ
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రాంగణంలో ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు.
సభా ప్రాంగణం చుట్టూ అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు అడుగడుగునా హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఆద్యంతం తిలకించేందుకు వీలుగా మైదానంలో ఎల్‌సీడీ టీవీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వచ్చే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేశారు.
మైదానం నలుమూలలా తెలుగుదేశం జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న మైదానంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాన వేదిక వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. మొత్తం 8,568 మంది పోలీసులు బందోబస్తు విధులకు కేటాయించగా ఇప్పటికే 7వేల మందికి పైగా పోలీసులు విధుల్లో చేరారు. ఆదివారం సాయంత్రం 7.27లకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ సమయంలో వేదికపైకి 40 మందిని మాత్రమే అనుమతించనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ప్రజాప్రతినిధులు కార్యకర్తల నుద్దేశించి బాబు ప్రసంగించనున్నారు. ఏర్పాట్లను ఆయన తనయుడు నారా లోకేష్ శనివారం పరిశీలించారు.
ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్, డీజీపీ...
చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ ృష్ణారావు, డీజీపీ జాస్తి వెంకట రాముడు శనివారం సాయంత్రం పరిశీలించారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.