సొరంగ మార్గాన్ని మూసివేసిన బెంచ్‌పై ఖనిజాన్ని తరలిస్తోన్న భారీ వాహనాలు
మంగంపేట(ఓబులవారిపల్లె) : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏపీఎండీసీ మంగంపేట గనుల్లో గురువారం రెండున్నర అడుగుల వెడల్పుతో.. పది మీటర్ల మేర సొరంగ మార్గం బయల్పడిన విషయం తెలిసిందే. అయితే మైనింగ్ కార్యకలాపాలకు అడ్డు వస్తుందనే ఉద్దేశంతో.. ఏపీఎండీసీ అధికారులు అప్పటికప్పుడు ఎవరికీ తెలియకుండా రహస్య మార్గాన్ని మూసివేశారు. మీడియా ప్రతినిధులను కూడా అనుమతించకుండా, అక్కడ ఏమీ లేదని ప్రకృతి సహజంగా ఏర్పడిందని ఏపీఎండీసీ అధికారులు దాట వేయడం వెనుక.. ఆంతర్యమేమిటనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయాన్నీ అధికారులు వెల్లడించకపోవడంతో ప్రజలకు అంతా రహస్యంగా మారింది.
బ్లాస్టింగ్‌లను సైతం తట్టుకుని నిలిచిన రహస్య మార్గం(ఫైల్ ఫోటో)
గనుల్లో బ్లాస్టింగ్ సైతం తట్టుకుని..
మంగంపేట గనుల్లో 1970లో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు 47 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి. అప్పట్లో మైనింగ్ మెన్‌వెల్ బ్లాస్టింగ్‌తో తవ్వకాలు జరిపి.. బెరైటీస్ ఖనిజాన్ని వెలికితీసేవారు. ప్రస్తుతం బ్లాస్టింగ్‌కు 10 నుంచి 20 టన్నుల పేలుడు పదార్ధాలు వినియోగిస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో పేలుళ్లకు తట్టుకుని రహస్య మార్గం చెక్కు చెదరకుండా ఉండటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో అప్పట్లో నిర్మించిన రహస్య మార్గాలు ఎంత పటిష్టమైనవో అర్థమవుతుంది. ఈ మార్గంలో ఇప్పటికీ మనిషి వెళ్లేందుకు వీలుగా గోడలు, పైకప్పు చెక్కు చెదరకుండా ఉన్నాయి.
మట్లిరాజుల పాలనలో...
మండలంలోని ఎర్రగుంటకోట (వైకోట)ను గతంలో మట్లిరాజులు పాలించే వారు. మట్లిరాజు అయిన వెంకటరామరాజు వంశీయులు తమ సంపదను దాచి పెట్టేందుకు, శత్రువుల బారి నుంచి కుటుంబ సభ్యులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వీలుగా అక్కడక్కడా రహస్య మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. మంగంపేట ఏపీఎండీసీ గనుల్లో బయటపడ్డ సొరంగ మార్గం కూడా వారు నిర్మించినదేనని ప్రజలు భావిస్తున్నారు.
ఉపరితల భూభాగం నుంచి 30 నుంచి 40 అడుగుల లోతులో ఏర్పాటు చేశారు. వైకోట నుంచి మంగంపేట మీదుగా బుడుగుంటపల్లె వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పురావస్తు శాఖ వారు పరిశీలిస్తే.. గుప్త నిధుల సమాచారం లేక మట్లిరాజుల కాలం నాటి చరిత్రకు సంబంధించిన విషయం ఏమైనా లభిస్తుందోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ శాఖ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా వారు పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment