మండవల్లి మండలం పులపర్రులోని కొల్లేరు అభయారణ్యంలో అక్రమ తవ్వకాలు
ఖాకీ చిత్రం ఇటీవల విడుదలయింది. కార్తీ హీరో. ఓ సిన్సియర్ పోలీసు ఆఫీసరు కరుడుగట్టిన ముఠా ఆచూకీ తెలిసి పట్టుకోవడానికి ఓ రాష్ట్రానికి పోలీసు సిబ్బందితో జీపులో వెళతాడు. గ్రామంలో ఎదురుగా ముఠా సభ్యులు కనిపిస్తారు. అదుపులోకి తీసుకోవడానికి వెళితే ఊరంతా మూకుమ్మడిగా దాడి చేస్తుంది. దీంతో ప్రాణభయంతో అందరూ పరుగులు తీస్తారు. సేమ్ టూ సేమ్ ఇదే సన్నివేశం ఇప్పుడు కొల్లేరులో కనిపిస్తోంది. చేంజ్ ఏంటంటే పోలీసు స్థానంలో ఫారెస్టు సిబ్బంది ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కొల్లేరు ఓటు బ్యాంకు కోసం పచ్చనేతలు చట్టాలకు తూట్లు పడేలా అక్రమార్కులకు అభయమిస్తున్నారు. అభయారణ్యంలో అక్రమంగా చెరువుల తవ్వకాలు సాగిస్తున్నారు.
కైకలూరు : కొల్లేరులో బరితెగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. యథేచ్ఛగా మంచినీటి చెరువుల పేరుతో అభయారణ్యాన్ని తవ్వేస్తున్నారు. టీడీపీ నాయకులు తెరవెనక ఉండి, మహిళలను ముందించి అటవీ చట్టాలకు పాతరేస్తున్నారు. సుప్రీం కోర్టు నిబంధనలు తుంగలో తొక్కుతున్నా ఫారెస్టు, రెవెన్యూ, పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కొల్లేరు ఆక్రమణల పర్వం కళ్లెదుట, కాగితాల్లో సర్వే నంబర్లతో సహా తేటతెల్లం అవుతున్నా అడ్డుకోవడంలో అటవీ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. రాజకీయ చట్రంలో ఇరుసులా ఇరుక్కుని బిక్కుబిక్కుమంటూ వీరు విధులు నిర్వహిస్తున్నారు.
ఆక్రమణలు పునరావృతం
ఎన్నికలు దగ్గరపడేకొద్ది కొల్లేరులో ఆక్రమణలపర్వం ఊపందుకుంది. 2016 జూలై నెలలో మండవల్లి మండలం పులపర్రు, చింతపాడు, దెయ్యంపాడు, కైకలూరు మండలం కొల్లేటికోట, కొట్టాడ గ్రామాల్లో పట్టపగలు చెరువులను తవ్వేశారు. అప్పట్లో పులపర్రులో అడ్డుకున్న ఫారెస్టు అధికారులను తరిమేశారు. జీపును సైతం పక్కకు తోసేశారు. ఇవే ఘటనలు పులపర్రులో తిరిగి పునరావృతమయ్యాయి. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నాలుగు పొక్లెయిన్లతో తాగునీటి చెరువు పేరుతో భారీ గట్లు వేశారు. యథావిధిగా మహిళలను ముందుంచి అటవీ అధికారులను అడ్డుకున్నారు. తవ్వకాల తెర వెనుక ప్రజాప్రతినిధులు ఉన్నారనే విషయం జగమెరిగిన సత్యం.
పాత్రికేయులపై దాడులు
పులపర్రు గ్రామంలో జరుగుతున్న ఆక్రమణను వెలుగులోకి తీసుకొస్తున్న పాత్రికేయులపై అక్రమార్కులు మహిళలతో దాడులు చేయిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తుంటే, తిరిగి మహిళలతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారు. అగ్గిపెట్టె కూడా తీసుకెళ్లకూడదనే నిబంధనలు ఉన్న అభయారణ్యంలో పొక్లెయిన్లతో తవ్వుతుంటే సీజ్ చేయలేని అటవీ సిబ్బంది, అంతా అయిపోయిన తర్వాత తూతూమంత్రగా కేసులు నమోదు చేసి సరిపెడుతున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఫారెస్టు సిబ్బంది కోమటిలంక రోడ్డు నిర్మాణం అంశంలో కైకలూరు టౌన్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినా అది బుట్టదాఖలయ్యింది.
ముందే హెచ్చరించిన ‘సాక్షి’..
కొల్లేరు గ్రామాల్లో ఆక్రమణలు జరిగే అవకాశముందని ఫిబ్రవరి 22న ‘దీపం ఉండగానే’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అటవీ సిబ్బంది ఈ కథనంపై కసరత్తు చేశారు. కలెక్టరు ఆరా తీశారు. అయినా ఆక్రమణల పర్వాన్ని అడ్డుకోవడంలో అటవీశాఖ హైడ్రామా నడిపించింది. ఇవే ఘటనలు పలు గ్రామాల్లో నెలకొని శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
కేసులతో సరి
పట్టపగలు పులపర్రు గ్రామంలో రెండోసారి కొల్లేరు అభయారణ్యంలో అక్రమ తవ్వకాలు జరిగాయి. ఈ ఘటనపై యథావిధిగా అటవీ అధికారులు రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రతి ఏటా ఆక్రమణలు జరగడం, కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారుతోంది. పులపర్రు గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ‘అంతా నేను చూసుకుంటాను మీరు కానిచ్చేయండి’ అంటూ ఆక్రమణదారులకు భరోసా ఇవ్వడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని అధికారులు భావిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
మండవల్లి మండలం పులపర్రులో అభయారణ్యంలో చెరువు గట్లు ఏర్పాటు చేసిన ఘటన వాస్తవం. దీనిపై పూర్తి విచారణ చేయాలని సిబ్బంది ఆదేశించాను. అటవీ శాఖ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. గ్రామస్తులకు అభయారణ్య చట్టాలను వివరించి ఏర్పాటు చేసిన అక్రమ గట్లను తొలగిస్తాం. – సాయిబాబా, అటవీశాఖ, డీఎఫ్‌వో
కొల్లేరు కాంటూరు కుదింపు జరగాలి
కొల్లేరు అభయారణ్యాన్ని కుదింపు చేయాలని కొల్లేరు పరివాహక ప్రజలు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. కొల్లేరు సమస్యలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే కొల్లేరు ప్రజలకు న్యాయం జరుగుతుంది. – దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్),
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, కైకలూరు
అక్రమ తవ్వకాల్లో టీడీపీ నాయకుల హస్తం
కొల్లేటిలో జరుగుతున్న అక్రమ తవ్వకాల వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉంది. కాంటూరు 5లో ధ్వంసం చేసిన చెరువుల స్థానంలో కొత్త చెరువుల తవ్వకాలకు ఊతం ఇస్తున్నారు. ఈ కారణంగా ఏదో ఒక నెపంతో కొల్లేటిలో చెరువుల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. చెరువుల కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది.
– మన్నేపల్లి ఆదాం, పీసీసీ సభ్యులు, మండవల్లి
తాగునీటి చెరువులకు అవకాశం ఇవ్వాలి
ప్రభుత్వాధికారులు కొల్లేరు గ్రామాల్లో తాగునీటి చెరువుల తవ్వకాలకు అవకాశం కల్పించాలి. ఆపరేషన్ కొల్లేరు కారణంగా కొల్లేరు ప్రజలకు నష్టం వాటిల్లింది. గ్రామాల్లో తాగునీటి చెరువుల విస్తీర్ణం, పెరిగిన జనాభాకు తగ్గట్టుగా లేదు. కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి.
– ఘంటసాల వెంకటేశ్వరరావు,
ఏపీ మత్స్యకారుల సంఘ ఉపాధ్యక్షుడు, కొవ్వాడలంక
Comments
Please login to add a commentAdd a comment